ఘోర రోడ్డు ప్రమాదం.. కారు-ట్రక్కు ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి..
అస్సాంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. వారంతా ఓ కారులో ప్రయాణిస్తున్నారు. ఆ వాహనం ట్రక్కును ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఓ కారు- ట్రక్కు వేగంగా ఢీకొన్నాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన అస్సాం లోని దిబ్రూగఢ్ లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలొ ట్రక్కు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. కారు కూడా పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి.
గౌహతి ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం టయోటా ఇన్నోవా కారులో ప్రయాణిస్తోంది. అయితే ఆ వాహనం ఆదివారం సాయంత్రం దిబ్రూగఢ్
లెప్తకట్ట ప్రాంతానికి చేరుకునేసరికి హర్యానా నెంబర్ ప్లేట్ తో ఉన్న ఓ ట్రక్కును వేగంగా ఎదురుగా ఢీకొట్టింది. ఈ విషాద ఘటనలో ఆ కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరి కొందరికి గాయాలు అయ్యాయి.
మృతులను సతీష్ కుమార్ అగర్వాల్ (45), పాంపీ అగర్వాల్ (42), కృష్ణ కుమార్ అగర్వాల్ (25), నిర్మల్ కుమార్ అగర్వాల్ (70), పుష్ప సురేఖ అగర్వాల్ (65), నమల్ అగర్వాల్, గోలో అగర్వాల్‌లుగా గుర్తించారు. దీనిపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను దిబ్రూగఢ్ లోని అస్సాం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్నారు.