మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీ నుండి త్రయంబకేశ్వర్ వైపు వెళుతున్న ఓ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా మరో 45మంది తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాకు చెందిన కొందరు ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిరిడికి ఓ ట్రావెల్ బస్సులో వెళ్లారు. దైవదర్శనం అనంతరం అదే బస్సులో వీరంతా తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో బస్సు త్రయంబకేశ్వర్ సమీపంలోకి ఘాట్ రోడ్డుపై అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. 

డ్రైవర్ బస్సును అదుపుచేయడంలో విఫలమవ్వడంతో ఘాట్ రోడ్డుపై నుండి లోయలోకి పడిపోయింది. దీంతో నలుగురు ప్రయాణికులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడగా...వారిలో కూడా ఓ 10 మంది ప్రాణాపాయ స్థితిలో వున్నట్లు తెలుస్తోంది. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారిని కాపాడి సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.