పొట్టకూటి కోసం వలస వెళ్ళిన కూలీలకు ఓ కారు రూపంలో మృత్యువు వెంటాడింది. కూలీ పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కొందరు బడుగు జీవులకు నిలువ నీడ లేకపోవడంతో పుట్ పాతే నివాసంగా మారింది. ఇలా రాత్రి సమయంలో పుట్ పాత్ పై నిద్రిస్తున్న ఆ కూలీలు ఓ వ్యక్తి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు బలయ్యారు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే....బిహార్ కు చెందిన కొందరు కూలీలు స్థానికంగా ఉపాధి లభించక కుటుంబ పోషణ భారంగా మారడంతో హర్యానాలోని హిసార్ పట్టణానికి వలస వెళ్లారు. అయితే అక్కడ పగలంతా కూలీ పనులు చేసుకుంటూ రాత్రి సమయంలో పట్టణంలోని ఓ బ్రిడ్జిపై గల  పుట్ పాత్ పై నిద్రించేవారు. 

అయితే మంగళవారం కూడా ఎప్పటిలాగే పనులు ముగించుకుని వచ్చిన కూలీలు రాత్రికి పుట్ పాత్ పై పడుకున్నారు. అయితే అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ కారు మితిమీరిన వేగంతో వెళుతూ సరిగ్గా కూలీలు నిద్రిస్తున్న బ్రిడ్జిపైకి రాగానే అదుపుతప్పింది. దీంతో కూలీలపై నుండి దూసుకుపోతూ ఎదురుగా వచ్చిన మరో కారును ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు నిద్రలోనే ప్రాణాలు వదిలారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ తో పాటు మరో కారు డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పెట్రోలింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.