ములాయం సింగ్ యాదవ్ మరణంపై ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ భావోద్వేగంగా స్పందించారు. గతంలో జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకున్నారు. సోషలిస్టుల ఉద్యమం ముందుకు వెళ్లడానికి ఆయన ప్రధాన పాత్ర పోషించారని అన్నారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మరణంతో దేశ ప్రధాని, సమాజ్‌వాదీ పార్టీ నేతలు సహా దేశవ్యాప్తంగా చాలా మంది నాయకులు సంతాపం ప్రకటించారు. ఇదే తరుణంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కూడా స్పందించారు. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ములాయం సింగ్ యాదవ్ మరణం తనను కలవరపెట్టిందని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ, ములాయం సింగ్ యాదవ్‌ను నేతాజీ అని సంబోధించారు. స్థానిక నేతలు, సమాజ్‌వాదీ పార్టీ నేతలు ములాయం సింగ్ యాదవ్‌ను నేతాజీ అని గౌరవంగా పిలుచుకుంటారు.
‘ములాయం సింగ్ యాదవ్ మరణం కలత పెట్టింది. నేతాజీ ఇప్పుడు మనలో లేరు. సోషలిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆయన ముఖ్యమైన సేవలు అందించారు. మా ఇద్దరి మధ్య ఒకే రకమైన సంబంధం ఉండేది. మేం ఫ్రెండ్స్. తిలక్కు ఆఫర్ ఇవ్వడానికి వెళ్లిన ఘటనను మేం గుర్తు చేసుకుంటాం. ప్రతి ఒక్కరి కోసం నేతాజీ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా గడపడానికి అరేంజ్‌మెంట్లు చేశారు’ అని లాలు ప్రసాద్ యాదవ్ వివరించారు.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని తాను దేవుడిని ప్రార్థిస్తున్నట్టు వివరించారు. ఈ విషాద సమయం నుంచి బయటపడటానికి ఆ కుటుంబం దేవుడు ధైర్యం ప్రసాదించాలని అన్నారు. ఈ రోజు జరిగిన పార్టీ కన్వెన్షన్‌లో ఆయన ములాయం సింగ్ యాదవ్ కోసం స్లోగన్లు కూడా ఇచ్చారు. నేషనల్ కన్వెన్షన్‌లో చివరగా ఆయన ములాయం సింగ్ అమర్ రహే అంటూ స్లోగన్ ఇచ్చారు.
అయితే.. ఆయన అంత్యక్రియలు అక్టోబర్ 11న ఆయన స్వగ్రామం సాయ్‌ఫాయ్‌లో నిర్వహించనున్నారు. ఎస్పీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రచారం.. ములాయం మృతదేహాన్ని లక్నోకు తరలించనున్నారు. అక్కడ ఆయన భౌతికకాయాన్ని పార్టీ కార్యాలయం, అసెంబ్లీలో ఉంచనున్నారు. రేపు అంటే అక్టోబర్ 11న మధ్యాహ్నం 3 గంటలకు సైఫాయిలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మృతితో సమాజ్‌వాదీ పార్టీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. ములాయం మృతిపట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
