జమ్ము కశ్మీర్ పుల్వామాలో సైనికులపై జరిగిన ఉగ్రదాడికి భారత్ ఇవాళ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి చొరబడి మరీ భారత వాయుసేన ఉగ్రవాదులను మట్టుబెట్టి వారి స్థావరాలను నేలమట్టం చేసింది. వాయుసేన విమానాలు భారీ ఎత్తున పేలుడు పదార్థాలతో ఉగ్ర స్థావరాలపై దాడులు జరపడంతో దాదాపు 300మంది ముష్కరులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ సర్జికల్ స్ట్రైక్స్ పై విశ్రాంత లెప్టినెంట్ జనరల్, 2016 సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో ఆర్మీ కమాండర్ గా వ్యవహరించిన దీపేంద్ర హుడా స్పందించారు. 

పీవోకే లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన జరిపిన ఈ దాడిపై ఆయన ప్రశంసలు కురిపించారు. పుల్వామాలో మన పైనికులను పొట్టనబెట్టుకున్న వారిపై ప్రతిదాడికి దిగితేనే సైనికుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందని తాను భావించానని తెలిపారు. అందుకోసం భారత్ గతంలో 2016లో జరిపినట్లే సర్జికల్ స్ట్రైక్ కు దిగితే భావుంటుందని అనుకున్నానని...అలా చేస్తుందని కూడా ముందే ఊహించానన్నారు. తాను అనుకున్నట్లే ఇవాళ మరో సర్జికల్ స్ట్రైక్ జరిగిందన్నారు. 

తెల్లవారుజామున భారత వాయుసేనకు చెందిన యుద్ద విమానాలు పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపి గట్టి హెచ్చరికలు పంపాయన్నారు. తమ జోలికి వస్తే చేతులు ముడుచుకుని కూర్చోకుండా ప్రతిదాడులకు దిగుతామని పాక్ వంటి ఉగ్రవాద దేశాలకు అర్థమయ్యేలా జవాబిచ్చారన్నారు. ఎల్వోసీలోకి వెళ్లి మరీ  దాడులు చేసిన వాయయుసేన క్షేమంగా తిరిగిరావచ్చినందుకు చాలా ఆనందంగా వుందన్నారు. 

అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన భారత వాయుసేన, ప్రభుత్వాన్ని దీపేంద్ర హుడా అభినందించారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడమే కాదు వాటిని విజయవంతంగా అమలుపర్చి భారత ఆర్మీ తన సత్తా ఏంటో మరోసారి చాటిందని హుడా పేర్కొన్నారు.