ఓ విశ్రాంత ఐఏఎఫ్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా... తన చావుకు కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరమే కారణమంటూ ఆరోపిస్తూ... ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసి మరీ చనిపోవడం గమనార్హం. 

పూర్తి వివరాల్లోకి వెళితే...అస్సాంకు చెందిన బిజన్‌ దాస్‌ ఈ నెల 6న ఉత్తరప్రదేశ్‌, అలహాబాద్‌లోని ఓ లాడ్జీలో దిగాడు. అయితే ఆదివారం రోజున ఆయన గది బయటకు రాకపోవడమే కాక ఆహారం కూడా తీసుకోలేదు. అనుమానం వచ్చిన వెయిటర్‌ ఈ విషయాన్ని హోటల్‌ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. దాంతో వారు గది లోపలికి వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు ఉరేసుకున్న బిజన్‌ దాస్‌ వారికి కనిపించాడు. గదిలో రెండు వేల రూపాయలతో పాటు ఓ ఐదు పేజీల సూసైడ్‌ నోట్‌ కూడా లభించింది.

ఆ సూసైడ్ నోట్ లో తాను తన కొడుకు కోసం ఏం చేయలేకపోయానని... ఉద్యోగ విరమణ తర్వాత చాలా ఉద్యోగాలకు ప్రయత్నించి విఫలమైనట్లు తెలిపాడు. తాను వ్యాపారంలో నష్టపోడానికి యూపీఏ ప్రభుత్వం, అప్పటి కేంద్ర మంత్రి చిదంబరమే కారణమని పేర్కొన్నాడు. ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే తనను నష్టాల్లో ముంచేత్తాయని పేర్కొన్నాడు.  తన కుమారుడు బాగా పాడతాడని.. ఓ టీవీ షోలో కూడా పాల్గొన్నాడని తెలిపాడు. తాను చనిపోవడంతో తన కుమారుడు దిక్కులేని వాడవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుమారుడు అతని కలలను సాకారం చేసుకునేందుకు మోదీ సహకరించాలని బిజన్‌ దాస్‌ విజ్ఞప్తి చేశాడు.

అంతేకాకుండా తన అంత్యక్రియలు అలహాబాద్ లోనే పూర్తి చేయాలని కోరుతూ... రూ.1500 నగదు హోటల్ గదిలో ఉంచినట్లు పేర్కొన్నాడు. మరో రూ.500 హోటల్ గది అద్దె  చెల్లించడానికి ఉంచినట్లు చెప్పారు. కాగా... అతని ఆత్మహత్య లేఖ కలకలం రేపుతోంది.