కేరళ : అదుపులోకి నిఫా వైరస్.. కోజికోడ్‌లో ఆంక్షలు సడలించిన అధికారులు
కేరళను నిఫా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. గత వారంలో నిఫా వైరస్ బారినపడిన కొత్త కేసులు ఏవీ లేకపోవడంతో కోజికోడ్ జిల్లా అధికారులు శుక్రవారం ఆంక్షలు సడలించారు . కేరళలో చివరిసారిగా సెప్టెంబర్ 15న నిఫా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది.

కేరళను నిఫా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికపై చర్యలు చేపట్టింది. ఈ ప్రయత్నాలు ఫలించి వైరస్ అదుపులోకి వస్తోంది. గత వారంలో నిఫా వైరస్ బారినపడిన కొత్త కేసులు ఏవీ లేకపోవడంతో కోజికోడ్ జిల్లా అధికారులు శుక్రవారం వడకర తాలూకాలోని తొమ్మిది పంచాయతీలలోని అన్ని వార్డులను కంటైన్‌మెంట్ జోన్ నుండి మినహాయించారు.
అలాగే మిగిలిన కంటైన్‌మెంట్ జోన్‌లలో మరిన్ని సడలింపులను ప్రకటించారు. కంటైన్‌మెంట్ జోన్‌లో ఉన్న ఫెరోక్ మున్సిపాలిటీలోని అన్ని వార్డులు , కోజికోడ్ కార్పొరేషన్‌లోని ఏడు వార్డులలో కూడా సడలింపులు ప్రకటించారు. కంటైన్‌మెంట్ జోన్‌లలోని అన్ని దుకాణాలు రాత్రి 8 గంటల వరకు పనిచేయవచ్చని, అన్ని బ్యాంకులు మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయవచ్చని జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ALso Read: Nipah In Kerala: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇ-సంజీవిని టెలిమెడిసిన్ సిస్టమ్ ప్రారంభం..
వడకర తాలూకాలో మరణించిన వారితో కాంటాక్ట్ అయిన వారికి పరీక్షలు నిర్వహించారు. అయితే, నిఫా-పాజిటివ్ రోగులతో సంప్రదించిన తర్వాత నిర్బంధంలో ఉన్న వ్యక్తులు ఆరోగ్య శాఖ నుండి తదుపరి సూచనలు వచ్చే వరకు క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు తెలియజేశారు. మాస్క్‌లు, శానిటైజర్‌లను ఉపయోగించడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటి అన్ని సాధారణ నిఫా పరిమితులను అనుసరించాలని ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. అదనంగా, కాంటాక్ట్‌లుగా జాబితా చేయబడిన వ్యక్తులు, నిఘాలో ఉన్నవారు తప్పనిసరిగా కఠినమైన పరిమితులకు కట్టుబడి ఉండాలి. నిర్దేశించిన వ్యవధి వరకు నిర్బంధంలో ఉండాలని.. తదుపరి నోటీసు వచ్చే వరకు ఇతర ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు.
కేరళలో చివరిసారిగా సెప్టెంబర్ 15న నిఫా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. రాష్ట్రంలో నిఫా సంక్రమణకు సంబంధించి మొత్తం ఆరు కేసులు నిర్ధారించబడ్డాయి. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన నలుగురు వ్యక్తులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.