రాజస్తాన్‌లో రిసార్ట్ రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. రాజ్యసభ సీట్లకు ఎన్నికల ప్రక్రియ మొదలవ్వగానే కాంగ్రెస్, బీజేపీ తమ బలాలను కాపాడుకోవడానికి రిసార్ట్‌ల దారి పట్టాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం మ్యాజిక్ షో నిర్వహించగా.. బీజేపీ ఎమ్మెల్యేలతో యోగా చేయించారు.
జైపూర్: రాజస్తాన్‌లో రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. రాజ్యసభ సీట్ల ఎన్నికల ప్రక్రియ మొదలవ్వగానే రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు ముందుజాగ్రత్తగా ఈ రాజకీయాలకు తెర లేపాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉదయ్‌పూర్‌లోని రిసార్ట్‌కు తరలించారు. అక్కడ నిన్న ఎమ్మెల్యేల కోసం మ్యాజిక్ షో నిర్వహిస్తున్నారు.
జాదుగార్ ఆంచల్‌తో మ్యాజిక్ షో పర్ఫామ్ చేయించినట్టు సమాచారం. జూన్ 2వ తేదీన కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించింది. వందకు మించి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ రిసార్ట్‌కు తరలించింది. వీరితోపాటు మొత్తం 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల్లో 12 మందిని కూడా కాంగ్రెస్ ఇక్కడికి పంపించింది. వీరితోపాటు ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు ముకుల్ వాస్నిక్, రణదీప్ సుర్జేవాలా, ప్రమోద్ తివారీలను కూడా సేఫ్‌గా అక్కడికే షిఫ్ట్ చేసింది. తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారనే ఆరోపణలతో కాంగ్రెస్ వీరిని రిసార్ట్‌కు పంపింది. కాగా, బీజేపీ కూడా తమ ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించింది. ట్రైనింగ్ క్యాంప్ పేరిట వారిని రిసార్ట్‌కు పంపి అక్కడ యోగా చేయిస్తున్నది.
రాజస్తాన్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 108 ఎమ్మెల్యేల బలం ఉన్న కాంగ్రెస్ రెండు స్థానాలను స్పష్టంగా గెలుచుకోనుంది. అయితే, మూడో సీటు గెలుచుకోవడానికి 41 ఎమ్మెల్యేలకు 15 ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉన్నది.
బీజేపీకి 71 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. ఈ పార్టీ ఒక్క సీటును గెలుచుకోవడం విస్పష్టం. ఒక్క అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. మరో అభ్యర్థి(స్వతంత్ర), మీడియా బేరన్ సుభాష్ చంద్రకు మద్దతు ఇస్తున్నది. ఈయనకు ఆర్ఎల్‌పీ కూడా మద్దతు ఇస్తున్నది. ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికీ ఈ సీటును దక్కించుకోవడానికి ఎనిమిది మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉన్నది.
కాగా, కాంగ్రెస్‌కు 123 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని వెల్లడించింది. 12 మంది స్వతంత్రులు, ఇద్దరు సీపీఎం ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని తెలిపింది. ఇదే నిజమైతే.. కాంగ్రెస్ మూడో స్థానాన్ని కూడా దక్కించుకోవడానికి మరో మూడు ఎమ్మెల్యే మద్దతు అవసరం పడుతున్నది. ఇందుకోసం భారతీయ ట్రైబల్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ కన్నేస్తున్నది.
