అంబాల: కరోనావైరస్ అనుమానితురాలి అంత్యక్రియలకు హర్యానాలోని అంబాలకు చెందిన ఓ గ్రామ ప్రజలు అడ్డుతగిలారు. కోవిడ్ -19 అనుమాతురాలి అంత్యక్రియలు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దానిపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోలీసులపై రాళ్లు విసిరారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. 

స్మశానవాటికలో పోలీసులపైకి, వైద్యులపైకి చాంద్ పూరా గ్రామ ప్రజలు లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘిస్తూ రాళ్లు రువ్వారు. దాంతో గుంపును చెదరగొట్టడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. గుంపును చెదరగొట్టిన తర్వాత అంత్యక్రియలను పూర్తి చేశారు. 

అనుమానితురాలి నమూనాలను పరీక్షలకు పంపించామని, ఫలితాలు రావాల్సి ఉందని వైద్యులు చెప్పారు. మహిళకు ఆస్త్మా ఉంది. సోమవారం సాయంత్రం ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. తాము శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం పంపించామని వైద్యులు చెప్పారు. 

గ్రామ ప్రజలను శాంతింపజేయడం పోలీసుల వల్ల కాలేదు. తాము అన్ని రక్షణ చర్యలు తీసుకున్నామని చెప్పినా వారు వినలేదని పోలీసులు అన్నారు. వాళ్లు పోలీసులపైకి, వైద్యులపైకి రాళ్లు రువ్వడం ప్రారంభించారని, అంబులెన్స్ ను ధ్వంసం చేశారని, గుంపు చెదరగొట్టడామనికి తాము కాస్తా బలప్రయోగం చేయాల్సి వచ్చిందని అంబాల కంటోన్మెంట్ డీఎస్పీ రామ్ కుమార్ చెప్పారు 

లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించి, వైద్యలపై, పోలీసుపై దాడి చేసినందుకు గ్రామ ప్రజలపై కేసులు పెడుతామని ఆయన చెప్పారు. అంబాలలో 12 కరోనా వైరస్ కేసులు నమోదయ్ాయయి. హర్యానాలో 289 కేసులు నమోదు కాగా, ముగ్గురు మరణించారు.