న్యూఢిల్లీ: ఢిల్లీ అధికారులు కంటైన్మెంట్ జోన్లు, క్వారంటైన్ సెంటర్లలోని ప్రజల కోరికలతో విసుగెత్తుతున్నారు.  చాలామంది చికెన్ బిర్యానీ, మటన్, పిజ్జా, స్వీట్లు, వేడి వేడి సమోసాలు అడుగుతున్నారు. తాము ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో అధికారులే అన్నీ సమకూరుస్తున్న నేపథ్యంలో వారు అటువంటి అసాధారమైన డిమాండ్లు పెడుతున్నారు. 

నిత్యావసరాలను సిబ్బంది ప్రజల ఇళ్లకే చేరవేస్తున్నాయి. కంటైన్మెంట్ జోన్లలోని ప్రజలను తమ అవసరాలను చెప్పేందుకు ఓ వాట్సప్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. వారి కోరిక మేరకు అధికారులు వాటిని వారి ఇళ్లకు అందిస్తున్నారు. 

చాలా మంది చికెన్ బిర్యానీ, మటన్ అడుగుతున్నట్లు అధికారులు చెప్పారు. దక్షిణ ఢిల్లీలో గల కంటైన్మెంట్ జోన్ల ప్రజలు వేడివేడి సమోసాలు, పిజ్జాలు అడుగుతున్నారు. తూర్పు, మధ్య  ఢిల్లీలోని కంటైన్మెంట్ జోన్ల ప్రజలు స్వీట్స్ అడుగుతున్నారు. 

అయితే, అటువంటి డిమాండ్లను తాము తీర్చలేమని అధికారులు అంటున్నారు. కూరగాయలు, నీళ్లు, పాల వంటి నిత్యావసరాలను మాత్రమే అందిస్తామని కచ్చితంగా చెబుతున్నారు. అసాధారణమైన డిమాండ్లను పట్టించుకోవద్దని క్షేత్ర సిబ్బందికి చెప్పినట్లు అధికారులు తెలిపారు. 

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఢిల్లీలో 76 కంటైన్మెంట్ జోన్లను ప్రకటించారు. ఢిల్లీలో 1,893 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 43 మంది మరణించారు. వారిలో 24 మంది 60 ఏళ్ల వయస్సు పైబడినవారు.