Asianet News TeluguAsianet News Telugu

పార్లమెంట్‌లోనే ప్రధాని మోదీ నన్ను శూర్పణఖతో పోల్చారు.. ఖర్గే వ్యాఖ్యలపై దుమారం వేళ రేణుకా చౌదరి ట్వీట్..

గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

Renuka Chowdhury says PM Modi compared me to Surpanakha on Kharge Ravan jibe
Author
First Published Nov 30, 2022, 10:15 AM IST

గుజరాత్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధాని మోదీ ఎప్పుడూ తన గురించే మాట్లాడుకుంటుంటారు.. ప్రతి ఎన్నికల్లో తన మొహం చూసే ఓట్లు వేయమని అడుగుతుంటారు.. ఆయనకు ఏమైనా రావణుడిలా వంద తలలు ఉన్నాయా? అని విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ మాటలు ఖర్గేకు గుజరాతీలపై ఉన్న ద్వేషాన్ని చాటుతున్నాయని కొందరు బీజేపీ నాయకులు ఆరోపించారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఆ ట్వీట్‌లో రేణుకా చౌదరి.. ప్రధాని మోదీ తనను పార్లమెంట్‌లో శూర్పణఖతో పోల్చారని ఆరోపించారు. అప్పుడు మీడియా ఎక్కడుందని ప్రశ్నించారు. అయితే రేణుకా చౌదరి ట్వీట్‌పై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్.. ప్రధాని మోదీ నవ్వుతూ ఈ భయంకర వ్యాఖ్యలు చేశారని అన్నారు. ‘‘అవును నేను ఆ రోజు అక్కడ ఉన్నాను. మోడీ స్వయంగా నవ్వుతూ ఆ భయంకర వ్యాఖ్య చేయడంతో బీజేపీ సభ్యుల నుంచి కూడా నవ్వులు వచ్చాయి. మీడియా ఆయనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు’’ అని జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు.

Also Read: రావ‌ణుడిలా మోదీకి 100 త‌ల‌లున్నాయా..? : మ‌ల్లికార్జున్‌ ఖ‌ర్గే 

 అయితే కొందరు నెటిజన్లు మాత్రం రేణుకా చౌదరిని శూర్పణఖ అని మోదీ అనలేదని ట్వీట్స్ చేస్తున్నారు. 2018లో రాజ్యసభలో చోటుచేసుకున్న సంభాషణకు సంబంధించిన వీడియో క్లిప్‌ను కూడా షేర్ చేశారు. మోదీ ఆమెను శూర్పణఖ అన్నట్టుగా రేణుకా చౌదరి తీర్మానించేసుకున్నారని కామెంట్ చేస్తున్నారు. ఆమె నవ్వును శూర్పణఖతో పోల్చుకుంటూ రేణుకా చౌదరి సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు.

 

నెటిజన్లు షేర్ చేస్తున్న ఆ వీడియో క్లిప్ ఏముందంటే.. ప్రధాని మోదీ మాట్లాడుతున్న సమయంలో అప్పుడు రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న వెంకయ్య నాయుడు జోక్యం చేసుకున్నారు. అయితే వెంకయ్య నాయుడు మాట్లాడుతుండగా.. సభలో ఓవైపు నుంచి నవ్వులు వినిపించాయి. దీనిపై స్పందించిన వెంకయ్య నాయుడు.. మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే దయచేసి డాక్టర్ వద్దకు వెళ్లండి అంటూ సీరియస్ అయ్యారు. ‘‘రేణుకా చౌదరి కూర్చొండి.. ఇది పద్దతి కాదు.. క్రమరహిత ప్రవర్తనను అనుమతించేది లేదు’’ అని వెంకయ్య నాయుడు అన్నారు. 

అయితే ఈ క్రమంలోనే వెంకయ్య నాయుడితో ప్రధాని మోదీ మాట్లాడుతూ..  ‘‘దయచేసి రేణుకా జీతో ఏమీ మాట్లాడవద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. రామాయణం సీరియల్ తర్వాత.. ఈ రోజు ఇలాంటి నవ్వు వినే అదృష్టం కలిగింది’’ అని అన్నారు. అయితే ఈ ఘటన.. ఆధార్‌పై ప్రధాని మోదీ చేసిన వాదన నేపథ్యంలో రేణుకా చౌదరి గట్టిగా నవ్వడంతో జరిగింది. 

 

ఇక, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎన్నిక ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు  ఖర్గే ప్రసంగిస్తూ.. ‘‘కార్పొరేష‌న్ ఎన్నిక‌లైనా, అసెంబ్లీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నిక‌లైనా మోడీ ముఖం క‌నిపిస్తోంది. ప్రతి ఎన్నికల్లో మోడీకి ఓటు వేయమని బీజేపీ అంటోంది... మోడీ ఇక్కడ పని చేయడానికి వస్తారా? మీకు ఎలాంటి ఇబ్బంది క‌లిగినా, అవ‌స‌రం వచ్చినా మోడీ వచ్చి సాయం చేస్తారా?. మోడీజీ మీకు రావ‌ణుడిలా 100 త‌ల‌లున్నాయా’’ అని ప్ర‌శ్నించారు. ఓట‌ర్ల నుంచి సానుభూతి పొందేందుకు ప్రధాని  తాను పేద‌వాడిన‌ని ప‌దేప‌దే చెబుతున్నార‌ని, ఆయ‌న అస‌త్యప్ర‌చారం చేస్తూ.. ఓట్ల వేట సాగిస్తున్నార‌ని ఖ‌ర్గే విమ‌ర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios