కర్ణాటకలో హిజాబ్ వివాదం మరో మలుపు తీసుకుంది. కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఆదేశాల మేరకు రాష్ట్రంలోని కాలేజీ, స్కూల్ యాజమాన్యాలు హిజాబ్, కాషాయ కండువాలను వేసుకురావడాన్ని ఆమోదించడం లేదు. అయితే, తాజాగా, ఇండి టౌన్‌లోని ఓ కాలేజీ.. నుదుటిపై తిలకం దిద్దుకుని రావడాన్ని అనుమతించలేదు.
బెంగళూరు: కర్ణాటక(Karnataka)లొ మొదలైన హిజాబ్ వివాదం(Hijab Row) సరికొత్త మలుపులు తిరుగుతున్నది. మొన్నటి వరకు విద్యార్థులకే పరిమితమైన ఈ వివాదం ఉపాధ్యాయులకూ పాకింది. హిజాబ్ తొలగించాలని కాలేజీ యాజమాన్యం ఆదేశాలను నిరసిస్తూ ఓ టీచర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఘటన చర్చనీయాంశం అయింది. తాజాగా, ఈ వివాదం మరో మలుపు తీసుకుంది. ఓ విద్యార్థి నుదుటిపై తిలకం(Tilak) ధరించడం కూడా అభ్యంతరకర విషయంగా మారింది. కర్ణాటకలోని ఓ కాలేజీ యాజమాన్యం.. నుదుటిపై తిలకం(Verrmilion) బొట్టు పెట్టుకుని వచ్చిన విద్యార్థిని గేటు బయటే నిలిపేశారు. ఆ తిలకాన్ని తొలగిస్తేనే కాలేజీలోకి అనుమతిస్తామని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటకలోని ఇండి టౌన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రోజులాగే ఓ విద్యార్థి నుదుటిపై తిలకం బొట్టు పెట్టుకుని కాలేజీకి వెళ్లాడు. కానీ, ఆ కాలేజీ యాజమాన్యం దాన్ని నిరాకరించింది. హిజాబ్, కాషాయ వర్ణపు కండువాలతోపాటు నుదుటిపై తిలకం కూడా వివాదానికి ఆజ్యం పోస్తున్నదని లెక్చరర్లు అభిప్రాయపడ్డారు. ఆ తిలకం బొట్టును తొలగించిన తర్వాత కాలేజీ లోపటికి పంపిస్తామని గేటు దగ్గరే ఆ స్టూడెంట్‌ను ఆపారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
కర్ణాటక ఉడిపి జిల్లాలో హిజాబ్ వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇది ఇతర జిల్లాలకూ వ్యాపించింది. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. హిజాబ్ ధరించడాన్ని అడ్డుకోవడంపై కొందరు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారిస్తున్న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితు రాజ్ అవస్తీ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు వెలువడే వరకు మతాన్ని వ్యక్తీకరించే వాటిని ధరించరాదని మధ్యంతర ఆదేశాలు వెలువరించింది. హిజాబ్, కాషాయ కండువాలు ధరించరాదని పేర్కొంది. ఈ ఆదేశాలే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కాలేజీ, పాఠశాల యాజమాన్యాలు పాటిస్తున్నాయి. అయితే, ఆ మధ్యంతర ఉత్తర్వుల్లో తిలకం ధరించరాదనే మాట పేర్కొనలేదు.
అయితే, కోర్టులో మాత్రం వాదోపవాదాలు బలంగా సాగుతున్నాయి. హిజాబ్ అనేది ఎప్పటి నుంచో ఆచరిస్తున్న సంప్రదాయం అని, ఇతర మతాల ప్రజలు నుదుటిపై తిలకం దిద్దుకోవడం, చేతులకు గాజులు వేసుకోవడం, రుద్రాక్షలు ధరించడం, సిక్కులు టర్బన్ కట్టుకోవడం లాగే.. హిజాబ్ ధరించడం అని పిటిషనర్ల తరఫు వాదనలు వినవచ్చాయి.
ఇదిలా ఉండగా, కర్ణాటకలోని ఓ కాలేజీ లెక్చరర్ రాజీనామా చేస్తూ పేర్కొన్న కారణం మరోసారి హిజాబ్ వివాదంపై చర్చకు ఆజ్యం పోసింది. నేను జైన్ పీయూ కాలేజీలో గత మూడేళ్లుగా పని చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఏ సమస్యనూ ఎదుర్కోలేదు. కానీ, నిన్న మా ప్రిన్సిపల్ నాకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. నేను టీచింగ్ చేసేటప్పుడు ఇక నుంచి నేను హిజాబ్, ఇతర మతపరమైన సింబల్స్ ధరించవద్దని చెప్పారు. కానీ, నేను గత మూడేళ్లుగా హిజాబ్ ధరించే పాఠాలు చెబుతున్నాను. ఈ కొత్త నిర్ణయం నా ఆత్మ గౌరవాన్ని గాయపరిచింది. అందుకే ఇక రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాను’ అని లెక్చరర్ చాందిని వివరించారు. కాగా, కాలేజీ ప్రిన్సిపల్ కేటీ మంజునాథ్ మాత్రం ఈ వాదనను కొట్టిపారేశారు. తాను కానీ, మేనేజ్‌మెంట్‌లోని మరే ఇతరులైనా ఆమెను హిజాబ్ తొలగించాలని ఆదేశించలేదని పేర్కొన్నారు.
