ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వివాదంలో చిక్కుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ లేకుండా.. ఆ రాష్ట్ర అధికారులతో అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సమావేశం కావడంపై విమర్శలు వస్తున్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వివాదంలో చిక్కుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ లేకుండా.. ఆ రాష్ట్ర అధికారులతో అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సమావేశం కావడంపై విమర్శలు వస్తున్నాయి. కేజ్రీవాల్‌పై ప్రతిపక్షాలు ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డాయి. పంజాబ్‌లో కేజ్రీవాల్ రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. దీంతో ఇప్పుడు ఈ వివాదం హాట్ టాపిక్‌గా మారింది.
ఇక, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (PSPCL) ఉన్నతాధికారులతో సమావేశమైనట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విద్యుత్ శాఖ కార్యదర్శి కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లేకపోవడంతో కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలు విమర్శలను ఎక్కుపెట్టాయి.
‘‘సీఎం భగవంత్ మాన్ లేకుండా.. అరవింద్ కేజ్రీవాల్ ఐఎఎస్ అధికారులను పిలిపించారు. ఢిల్లీ రిమోట్ కంట్రోల్‌ను ఇది బహిర్గతం చేస్తుంది. సమాఖ్యవాదాన్ని స్పష్టంగా ఉల్లంఘించారు. ఇది పంజాబీల గౌరవానికి అవమానం. దీనిపై ఇద్దరు(కేజ్రీవాల్, భగవంత్ మాన్) స్పష్టత ఇవ్వాలి’’ అని పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ట్వీట్ చేశారు.
ఇందుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పందించారు. చాలా ఘోరం జరిగిందని ఆరోపించారు. ఊహించిన సమయం కంటే ముందుగానే కేజ్రీవాల్ పంజాబ్‌ను తన చేతుల్లోకి తీసుకున్నారని విమర్శించారు. భగవంత్ మాన్ రబ్బర్ స్టాంప్ అని ముందే తెలిసిపోయిందని.. పంజాబ్ అధికారుల సమావేశానికి అధ్యక్షత వహించడం ద్వారా కేజ్రీవాల్ అది నిర్దారణ అయిందని అన్నారు.
ఇదిలా ఉంటే.. పంజాబ్ అధికారులతో సీఎం కేజ్రీవాల్ భేటీ అవ్వడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సమర్దించుకుంది. ‘‘కేజ్రీవాల్ మా జాతీయ కన్వీనర్. మేము ఎల్లప్పుడూ అతని మార్గదర్శకాలను పాటిస్తాం. పంజాబ్‌లో ఏదైనా అభివృద్ధి కోసం.. అనధికారిక సమావేశం జరిగితే ప్రతిపక్షాలు దానిని విమర్శించకూడదు.. నిజానికి అభినందించాలి’’ అని ఆప్ ప్రతినిధి మల్వీందర్ సింగ్ కాంగ్ విలేకరులతో అన్నారు. .
