ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్ట్ పత్రికా స్వేచ్ఛపై దాడి అని  కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. ఆర్నబ్ ను  ముంబై  పోలీసులు అరెస్టు చేయడంపై ఆయన ఈ విదంగా స్పందించారు.

ఈ ఘటన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని, మహారాష్ట్ర పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు. మహారాష్ట్రలో పత్రికా స్వేచ్ఛపై దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్న ఆయన మీడియా పట్ల ఈ వైఖరి సరైంది కాదంటూ ట్వీట్‌ చేశారు. 

కాగా ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్, అతని తల్లి కుముద్ నాయక్‌తో కలిసి మే, 2018లో అలీబాగ్‌లోని వారి బంగ్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. రిపబ్లిక్ టీవీ స్టూడియోలను రూపొందించిన డిజైనర్ అన్వే నాయక్‌కు బిల్లులు చెల్లించకపోవడంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో అర్నాబ్‌పై రాయ్‌గడ్‌లో కేసు నమోదైంది. 

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్థానిక రాయ్‌గడ్ పోలీసులు గోస్వామితో సహా సూసైడ్ నోట్‌లో పేర్కొన్న నిందితులపై తమకు ఆధారాలు దొరకలేదని 2019 ఏప్రిల్‌లో కేసును మూసివేశారు. అయితే, ఈ ఏడాది మేలో, అన్వే కుమార్తె ఈ కేసుపై తిరిగి దర్యాప్తు చేయాలని కోరుతూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో  అర్నాబ్ గోస్వామిని  ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజ్‌, సాయుధులైన పోలీసులతో అర్నాబ్‌ను నిర్బంధించారని రిపబ్లిక్‌ టీవీ ఆరోపించింది.