న్యూఢిల్లీ: తమ మత విశ్వాసాలకు విరుద్దంగా తన భర్త మృతదేహాన్ని ఖననం చేశారని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. కోర్టు కూడ  ఆ మహిళకు అనుకూలంగా తీర్పు చెప్పింది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సంజీవ్ కుమార్  వయస్సు 49 ఏళ్లు.  దాదాపు 23ఏళ్ల నుంచి సౌదీలో పని చేస్తున్నాడు. ఈ ఏడాది  జనవరి 24న అతనికి గుండెపోటు రావడంతో సౌదీ బీష్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించాడు. 

అయితే  జెడ్డా భారత రాయబార కార్యాలయంలో పని చేసే ఓ ట్రాన్స్‌లేటర్ చేసిన తప్పిదంతో సంజీవ్ కుమార్‌ను ముస్లింగా భావించి, ఆ మత సంప్రదాయాల ప్రకారమే సౌదీలో ఖననం చేశారు. ఈ విషయం తెలిసిన సంజీవ్ కుమార్ భఆర్య అంజూశర్మ న్యాయపోరాటానికి దిగారు. తెలంగాణ ఇమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు భీమ్ రెడ్డి సహాయంతో ఢిల్లీ హైకోర్టులో పిల్‌ను దాఖలు చేశారు. 

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సంజీవ్ కుమార్ మృతదేహాన్ని అంజూశర్మకు స్వాధీన పరచాలని తీర్పు చెప్పింది. ఈ క్రమంలో సౌదీలోని అధికారులు పూడ్చిపెట్టిన మృతదేహాన్ని దాదాపు వంద రోజుల తర్వాత తవ్వి తీయించి కార్గో విమానంలో బుధవారంనాడు ఢిల్లీకి తరలించారు. ఈ నేపథ్యంలో సంజీవ్ కుమార్ మృతదేహాన్ని విదేశాంగశాఖ అధికారులు ఎయిర్‌పోర్ట్‌లోనే అంజూశర్మకు అప్పగించారు.