Asianet News TeluguAsianet News Telugu

Nupur Sharma: సుప్రీంకోర్టులో నుపుర్ శర్మకు పెద్ద ఊరట.. అన్ని కేసులు ఢిల్లీకి బదిలీ.. అరెస్టు నుంచి రక్షణ

నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వేర్వేరు రాష్ట్రాల్లో ఆమెపై నమోదైన కేసులను ఢిల్లీకి బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆమెకు ఇచ్చిన అరెస్టు నుంచి రక్షణ అలాగే కొనసాగనుంది. మొహమ్మద్ ప్రవక్త వ్యాఖ్యల విషయమై భవిష్యత్‌లోనూ నమోదయ్యే కేసులు ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ అవుతాయని సుప్రీంకోర్టు వివరించింది. ఆమెకు వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో ఈ తీర్పు ఇచ్చినట్టు తెలిపింది.
 

relief to nupur sharma.. all cases to transfer delhi.. supreme court ruling
Author
New Delhi, First Published Aug 10, 2022, 5:06 PM IST

న్యూఢిల్లీ: బీజేపీ నేత నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఓ టీవీ డిబేట్‌లో ఆమె మొహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. పలు రాష్ట్రాల్లో ఆమె పై కేసులు నమోదయ్యాయి. అంతర్జాతీయంగానూ తీవ్ర నిరసన వ్యక్తం అయింది. చంపేస్తామని, రేప్ చేస్తామని కూడా ఆమెకు చాలా బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపుల నడుమ ఆమె పలు రాష్ట్రాలు తిరుగుతూ కేసుల  దర్యాప్తులో పాల్గొనడం ప్రమాదకరంగా మారింది. కాబట్టి, పలు రాష్ట్రాలపై తనపై నమోదైన 10 కేసులను ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ చేయాలని ఆమె సుప్రీంకోర్టుకు నివేదించింది.  ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజాగా అనుకూల తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పుతో వేర్వేరు రాష్ట్రాల్లో ఆమెపై నమోదైన పది కేసులు ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఆ కేసులను క్లబ్ చేసి ఢిల్లీ పోలీసులు విచారిస్తారు. అలాగే, భవిష్యత్‌లోనూ ఇదే విషయమై ఆమెపై ఏవైనా కేసులు నమోదైనా.. అవి ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ అవుతాయని సుప్రీంకోర్టు తెలిపింది.

ఈ కేసుల్లో ఆమెకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ ఇస్తూ సుప్రీంకోర్టు జులై 19న తీర్పు ఇచ్చింది. ఈ రక్షణ ఇలాగే కొనసాగనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పర్దివాలా ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. నుపుర్ శర్మకు వస్తున్న బెదిరింపులను తమ దృష్టిలో ఉంచుకుని ఈ తీర్పు ఇస్తున్నట్టు తెలిపింది. 

వేర్వేరు రాష్ట్రాల్లో తన పై మొహ్మమద్ ప్రవక్తపై వ్యాఖ్యల కారణంగా నమోదైన కేసులను ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ చేయాలని నుపుర్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కానీ, అభ్యర్థనను పశ్చిమ బెంగాల్ వ్యతిరేకిస్తున్నది.

ఈ ధర్మాసనమే గతంలో నుపుర్ శర్మపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అల్లకల్లోలానికి కేవలం ఆమె వ్యాఖ్యలే కారణం అని మండిపడింది. 

నుపుర్ శర్మపై ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, జమ్ము కశ్మీర్, అసోంలలో కేసులు రిజిస్టర్ అయ్యాయి.

నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఆ వ్యాఖ్యల నుంచి బీజేపీ దూరంగా జరిగింది. ఆమెను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా సస్పెండ్ చేసింది. గల్ఫ్ దేశాల నుంచీ ఆమె వ్యాఖ్యలపై నిరసన వచ్చింది. ఆ వ్యాఖ్యలు చేసిన వారితో ప్రభుత్వానికి సంబంధం లేదని సమాధానంగా చెప్పింది. ప్రధాన స్రవంతికి దూరంగా ఉన్న కొన్ని శక్తులు ఈ వ్యాఖ్యలు చేశాయని పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios