తెలంగాణలో కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటలకే మిట్టమధ్యాహ్నం తరహాలో ఎండ, వేడి వస్తోంది. బయటకు వెళ్తే ఒంట్లోని సారం గమొత్తాన్ని భానుడు పీల్చేస్తున్నాడు. దీనికి తోడు మధ్యాహ్నం సమయంలో వడగాడ్పుల ధాటికి ప్రజలు తపించిపోతున్నారు. గత నాలుగైదు రోజులుగా ఈ వడగాల్పుల తీవ్రత ఉంటూ వస్తోంది.

కాగా.. ఈ ఎండ తీవ్రత నుంచి సోమవారం కాస్త ఉపశమనం లభించింది. సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షం పడింది. చల్లగాలులతో కాస్త హాయిగా అనిపించింది. కాగా ఉత్తర భారతమంతటా, దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో  ఈ నెల 29, 30తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

కాగా.. గత వారం రోజులుగా ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లలో 45డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ వేడిని జనాలు తట్టుకోలేకపోయారు. గడిచిన రెండు రోజుల్లో వేడి తీవ్రత మరింత ఎక్కువగా పెరిగిపోతుందని అందరూ భావించారు. అయితే.. చిరుగాలులు కాస్త ఉపశమనం కలిగించాయి. నెలాఖరులో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. గంటలకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. దీంతో.. వేడి నుంచి ప్రజలు తేరుకుంటారని వారు చెబుతున్నారు.