భారత పారిశ్రామిక దిగ్గజం, దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ మరో అరుదైన ఘనత సాధించారు. సంపన్నుల జాబితాలో అమెరికన్ దిగ్గజం వారెన్ బఫెట్‌ను వెనక్కినెట్టారు.

బ్లూమ్‌బర్గ్ సంపన్నుల సూచీ ప్రకారం ప్రపంచ కుబేరుల్లో 8వ స్థానానికి చేరుకున్నారు. ఆసియా ఖండం నుంచి ఆ లిస్ట్‌లో టాప్- 10లో ఉన్న ఒకే ఒక్కరు ముఖేశ్ అంబానీ కావడం గమనార్హం.

రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రుణరహిత సంస్థగా మార్చాలని కృత నిశ్చయంతో ఉన్న ఆయన ఆ పనిలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రిలయన్స్ విలువ 68.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో బఫెట్ సంస్థ బెర్క్‌షైన్ హాత్‌వే (67.9 బిలియన్ డాలర్లు)ను దాటేసింది.

అయితే అపర దాన కర్ణుడిగా పేరొందిన వారెన్ బఫెట్.. 2.9 బిలియన్ డాలర్లను విరాళంగా ఇవ్వడం, సంస్థ పనితీరు కాస్త మందగించడంతో బఫెట్ తొమ్మిదో స్థానానికి పడిపోయారు. 2006లోనూ 37 మిలియన్ డాలర్లను విరాళంగా ఇవ్వడంతో ఆయన ర్యాంక్ తగ్గిన సంగతి తెలిసిందే.

కాగా ఈ ఏడాది రిలయన్స్ ఇండస్ట్రిస్ డిజిటల్ విభాగంలో ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ సహా కొన్ని కంపెనీలు 15 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. అలాగే రిలయన్స్ చమురు రిటైల్ వ్యాపారంలో బీపీ పీఎల్‌సీ బిలియన్ డాలర్ల వాటాను కొనుగోలు చేసింది. మొత్తంగా 2020లో ఎంఅండ్ఏ ద్వారా ముఖేశ్ 12 శాతానికి పైగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.