మరణించిన ఓ మహిళ మృతదేహం కారులో ఉన్నది. బంధువులు ఓ లాయర్‌ను పిలిపించారు. ఆమె వేలిముద్రలను కొన్ని పేపర్లపై తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు చెందిన ఇల్లు, షాప్ వారి సొంతమైంది. వేలిముద్రలు తీసుకుంటున్నప్పటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

న్యూఢిల్లీ: ఆస్తి కోసం వారు గడ్డితిన్నారు. అమానుషంగా ప్రవర్తించారు. మృతదేహం అని కూడా చూడకుండా చేతి వేలి ముద్రలు తీసుకున్నారు. ఆస్తులు కాజేశారు. డెడ్ బాడీ నుంచి వేలిముద్రలు ప్రాపర్టీ పేపర్లపై పెట్టించుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అయింది.

ఈ వీడియో 2021 కాలానిదని పోలీసులు తెలిపారు. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఒక ఫిర్యాదు పోలీసులకు అందింది. ఫిర్యాదు దారుడు వేలిముద్రలు తీసుకున్న ఆ మహిళకు మనవడు. పేరు జితేంద్ర శర్మ.

మరణించిన మహిళ పేరు కమలా దేవీ అని జితేంద్ర శర్మ తెలిపారు. కమలా దేవీ తన తల్లికి మేనత్త అవుతుందని వివరించారు. ఆమె 2021 మే 8వ తేదీన మరణించినట్టు పేర్కొన్నారు. ఆమె భర్త అంతకు ముందే మరణించాడని వివరించారు. అయితే, ఆ దంపతులకు పిల్లలెవరూ లేరని తెలిపారు.

Also Read: పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే డబుల్ ఫైన్.. విచారణనూ ఎదుర్కోవాల్సిందే.. ఎక్కడంటే?

శర్మ తెలిపిన వివరాల ప్రకారం, ఆ మహిళ మరణించిన తర్వాత ఆమె భర్త సోదరుడి కొడుకులు కమలా దేవీని ఆగ్రా హాస్పిటల్‌కు తీసుకెళ్లుతున్నామని చెప్పి కారులో తీసుకెళ్లారని వివరించారు. ఆ హాస్పిటల్ చేరడానికి ముందు కారును ఆపేసి లాయర్‌ను పిలిపించి ప్రాపర్టీ పేపర్లపై ఆమె వేలి ముద్రలు తీసుకున్నారని ఆరోపించారు.

ఆ ఫోర్జ్‌డ్ డాక్యుమెంట్లతో వారు ఆమె ప్రాపర్టీలను సొంతం చేసుకు న్నారని తెలిపారు. ఆమె పేరిట ఇల్లు, ఓ షాప్ ఉండేదని వివరించారు.

Scroll to load tweet…

కమలా దేవి సాధారణంగా సిగ్నేచర్ పెడుతుండేదని, కానీ, ఆ ప్రాపర్టీ పేపర్లపై వేలిముద్రలు ఉండటంతో తమకు అనుమానం వచ్చిందని శర్మ వివరించారు. అయితే, కారులోని మృతదేహం నుంచి వేలిముద్రలు తీసుకుంటున్న ఓ వీడియో బయటకు వచ్చింది. మరణించిన మహిళ చేతి బొటనవేలిని స్టాంప్ ప్యాడ్ పై ఉంచి పలు పేపర్లపై థంబ్ ప్రింట్ వేయిస్తున్నట్టు వీడియోలో కనిపిస్తున్నది.

ఈ కేసులో దర్యాప్తు మొదలు పెట్టామని ఆగ్రా పోలీసులు తెలిపారు. 

ఆ వీడియోపై చాలా మంది నెటిజన్లు ఆగ్రహించారు. అది అమానుష ఘటన అని వాపోయారు. అలాంటి వారిని సామాజికంగా బహిష్కరించాలని కొందరు ఫైర్ అయ్యారు. ఇంకొందరు ఆ లాయర్ లైసెన్స్‌ను రద్దు చేయాలని కోరారు.