మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లోని ఓ భవనంలో ఏడుగురి ప్రాణాలను బలిగొన్న అగ్ని ప్రమాద ఘటన వెనక షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భవనంలో మంటలు చెలరేగడానికి ఓ ప్రేమోన్మాది కారణమని తేలింది.
మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లోని ఓ భవనంలో ఏడుగురి ప్రాణాలను బలిగొన్న అగ్ని ప్రమాద ఘటన వెనక షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భవనంలో మంటలు చెలరేగడానికి ఓ ప్రేమోన్మాది కారణమని తేలింది. అతడిపై శనివారం రాత్రి కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. నిందితుడు శుభం దీక్షిత్ తన ప్రేమను తిరస్కరించిన మహిళకు చెందిన వాహనాన్ని తగలబెట్టడంతో.. అది ఇతర వాహనాలకు వ్యాపించి భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
వివరాలు.. శనివారం తెల్లవారుజామున ఇండోర్ విజయ్ నగర్‌లోని ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. మరికొందరు అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో వారి ఫ్లాట్ల బాల్కనీల నుంచి కిందకు దూకి ప్రాణాలను రక్షించారు. అయితే ఈ క్రమంలో వారికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీని వల్ల ప్రాణ నష్టం పెరిగిందని వారు చెబుతున్నారు.
ఇక, బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగినట్టుగా గుర్తించిన పోలీసులు.. తొలుత షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణంగా భావించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో చెలరేగిన మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించాయని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఇక, ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు.
అయితే పోలీసులు విచారణ కీలక విషయాలు వెలుగుచూశాయి. తన ప్రేమను తిరస్కరించిన యువతిపై కోపంతో శుభవ్ దీక్షిత్ ఆమె స్కూటర్‌కు నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. 27 ఏళ్ల శుభమ్ దీక్షిత్.. ప్రమాదం చోటుచేసుకున్న భవనంలోనే ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. అతడు అదే కాంప్లెక్స్‌లో నివసించే ఓ యువతిని ప్రేమించాడు. అయితే ఆ విషయం యువతికి చెబితే.. ఆమె తిరస్కరించింది. ఆమెకు మరోకరితో నిశ్చితార్థం చేసుకున్నారు. దీంతో యువతిపై కోపం పెంచుకున్న శుభమ్ దీక్షిత్.. శనివారం తెల్లవారుజామున ఆమె స్కూటర్‌కు నిప్పు పెట్టాడు.
ఆ మంటలు క్రమంగా ఇతర వాహనాలకు, పార్కింగ్ స్థలం నుంచి పై అంతస్తులకు వ్యాపించాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో తొమ్మిది మంది ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆ యువతి కూడా ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన అనంతరం అక్కడి నుంచి పారిపోయిన శుభమ్ దీక్షిత్‌ను పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. అతడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. అతడిని పట్టుకోవడంలో పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్ సాయపడింది.
