కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలైంది. ఇందుకోసం రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ మూడు రోజుల పాటు మేధోమథన కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభం అవుతున్న ఈ సదస్సులో ఒక కుటుంబం ఒక టికెట్ రూల్, ఏజ్ లిమిట్ రూల్‌ వంటివాటిపై కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకోబోతున్నది. 

న్యూఢిల్లీ: పార్లమెంటు ఎన్నికల కోసం కాంగ్రెస్ సమాయత్తం అవుతున్నది. 2024 కంటే ముందే పార్టీలో ప్రక్షాళనలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ రోజు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ మేధోమథన కార్యక్రమం చేపడుతున్నది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ మేధోమథనం శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభం అవుతుందని పార్టీవర్గాలు తెలిపాయి. ఇందులో సుమారు 400 మంది కాంగ్రెస్ నేతలు పాల్గొనబోతున్నట్టు తెలిసింది. మరొక విషయం ఇక్కడ ప్రస్తావించాలి. ఈ నిబంధనల నుంచి గాంధీ కుటుంబానికి మినహాయింపు ఉన్నట్టు అర్థం అవుతున్నది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో సమూల ప్రక్షాళన కావాలని డిమాండ్ చేసిన వారి ఆశలపై నీళ్లు చల్లినట్టుగానే భావిస్తున్నారు. లోతైన మార్పులు కాకుండా ఉపరితల.. పైపై మెరుగులు దిద్దుతున్నదనే ఆరోపణలూ వస్తున్నాయి. ఈ చింతన్ శివిర్ కార్యక్రమాన్ని నవ సంకల్ప చింతన్ శివిర్‌గా కాంగ్రెస్ నేతల పిలుస్తున్నారు. ఈ మూడు రోజుల కార్యక్రమంలో గాంధీలు పాల్గొంటారు.

ఈ చింతన్ శివిర్ కార్యక్రమం నేపథ్యంలో రాజస్తాన్ ఉదయ్‌పూర్ కాంగ్రెస్ లీడర్ అజయ్ మాకెన్ కీలక విషయాలు వెల్లడించారు. ఒక కుటుంబం ఒక టికెట్ రూల్‌కు కాంగ్రెస్ రెడీ అయింది. ఈ నిబంధనపై కాంగ్రెస్ ప్యానెల్‌కు ఏకాభిప్రాయం ఉన్నదని అజయ్ మాకెన్ వివరించారు. పార్టీ లీడర్‌కు తప్పితే వారి బంధువులకు టికెట్ ఇవ్వరాదనే నిబంధనకు నేతలు సుముఖంగా ఉన్నారని తెలిపారు. అయితే, వారికీ టికెట్ ఇవ్వాలంటే వారు కనీసం ఐదు సంవత్సరాలు పార్టీ కోసం పని చేసి ఉండాలని చెప్పారు. ఈ నిబంధన నుంచి గాంధీలకు మినహాయింపు ఉన్నదా? అని ప్రశ్నించగా.. వారు రాజకీయాల్లో ఐదేళ్లుగా యాక్టివ్‌గా ఉన్నారని, ప్రియాంక గాంధీ 2018 నుంచే పార్టీ కోసం పని చేస్తున్నారని వివరించారు.

ఈ నిబంధనతోపాటు కాంగ్రెస్ మరికొన్ని మార్పులు చేయబోతున్నది. రాజ్యసభ సభ్యుల ఎన్నికపైనా ఏజ్ లిమిట్ పెట్టనుంది. కాంగ్రెస్ పార్టీలో సగం మంది నేతలు 50 ఏళ్లకు లోబడే ఉండాలనే కండీషన్ పెట్టబోతున్నది. దేశంలో 60 శాతం మంది ప్రజలు 40 ఏళ్లలోపు వారేనని, కాబట్టి, తమ పార్టీ యూనిట్లూ సాధారణ ప్రజానీకాన్ని ప్రతిబింబించేలా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మానిక్కం ఠాగూర్ తెలిపారు. ఈ మేధోమథన కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ నిబంధనలు పార్టీలో అమలు అవుతాయని నేతలు చెబుతున్నారు.

వీటితోపాటు ఈ మూడు రోజుల సదస్సులో వ్యవస్థాగత విషయాలతోపాటు, దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, సామాజిక న్యాయం, రైతులు, యువతపై చర్చ చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రూపులను ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపులో 60 నుంచి 70 మంది ఉండబోతున్నారని తెలిసింది.