ప్రపంచంలో వింతలు, విశేషాలకు కొదువ లేదు. ఎప్పుడూ ఏదో ఓ మూల ఏదో వింత సంఘటన జరగుతూనే ఉంటుంది. వాటిల్లో కొన్ని ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాయి. మరికొన్ని ఆయా రంగాలకే సవాల్ గా నిలుస్తాయి. అలాంటిదే ఓ సంఘటన చండీగఢ్ లో జరిగింది.

పాతికేళ్ల ఓ మహిళ కంటినుంచి రక్తకన్నీరు కారుతోంది. అయితే ఇలా వస్తున్నా ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగకపోవడం గమనార్హం. ఆమె తన సమస్య గురించి ఓ ఆస్పత్రికి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

చండీగఢ్ లోని ఓ పాతికేళ్లమహిళ తన కంట్లోంచి రక్తం కారుతుందంటూ స్థానిక ఆస్పత్రికి వచ్చింది. ఇది వరకొకసారి కూడా తనకు ఇలా వచ్చిందని అయితే దీనివల్ల కంట్లో తనకెలాంటి ఇబ్బంది కానీ, బాధ కానీ లేదని చెప్పింది. దీంతో ఆశ్చర్యపోయిన వైద్యులు కంటికి సంబంధించి పలు పరీక్షలు చేశారు. కానీ, ఆ పరీక్షల్లో ఆమెకు ఎటువంటి కంటి సమస్యా లేదని తేలింది. దీంతో వైద్యులు ఆశ్చర్యపోయారు.

వైద్య రంగానికే సవాల్ గా మారిన ఈ సమస్యమీద మరింత లోతైన అధ్యయనం చేశారు. దీంతో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మహిళకు రక్తకన్నీరు కారిన సమయంలో ఆమె పీరియడ్స్ లో ఉందని తేలింది. కంట్లోనుంచి రక్తం కారిన రెండు సందర్భాల్లోనూ ఆమె నెలసరిలో ఉన్నట్టు డాక్టర్లు తెలుసుకున్నారు. 

దీంతో ఈ సమస్య గురించి డాక్టర్లకు ఓ స్పష్టత వచ్చింది. దీన్ని ఓక్యులార్ వికేరియస్ మెన్ స్ట్రుయేషన్ అనే అరుదైన సమస్యగా తేల్చారు. ఈ సమస్యతోనే సదరు యువతి బాధపడుతున్నట్టు డాక్టర్లు గుర్తించారు. అంతేకాదు ఈ సమస్య ఉన్న మహిళల్లో బహిస్టు సమయంలో కంట్లోంచి రక్తం కారే అవకాశం ఉందని వారు తెలిపారు. 

సాధారణంగా కంట్లో ట్యూమర్ కానీ, ఏదైనా దెబ్బకానీ తగిలితే ఇలాంటి సమస్య వస్తుంది. కానీ బహిష్టు సమయంలో శరీరంలోని హార్మోన్లలో మార్పులు జరగడంతో ఈ పరిస్థితి వచ్చినట్టు వైద్యులు చెబుతున్నారు. స్త్రీ హార్మోన్ల కారణంగా గర్భాశయంలోని సన్నని రక్తనాళాలు పలుచబడి రక్తం కారుతుంది. ఇదే పరిస్తితి సదరు యువతి కంట్లో కూడా ఉండి ఉండొచ్చని వారు అభిప్రాయ పడ్డారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.