హిందూ మహా సముద్రానికి అనుకోని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘‘ఫణి’’ తుఫాను కోస్తాను భయపెడుతోంది. గురువారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం కొద్దిగంటల్లోనే తీవ్ర అల్పపీడనంగా మారింది.

దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. ఈ నేపథ్యంలో తీవ్ర అల్పపీడనం శుక్రవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది.

అనంతరం శనివారం నాటికి తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది 72 గంటల తర్వాత శ్రీలంక తూర్పు తీర ప్రాంతం వెంబడి వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 30న తమిళనాడు-దక్షిణ కోస్తాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

దీని ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

తుఫాను తీరం దాటే సమయంలో పెనుగాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. వాయుగుండం, తుఫాను నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. ఈ సమయంలో చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ నెల 30 వరకు సముద్రంలోకి వెళ్లకపోవడమే మంచిదని తెలిపింది. ఈ తుఫానుకు ‘‘ఫణి’’ అనే పేరును పెట్టారు. దీనిని బంగ్లాదేశ్ సూచించింది.