భారత రత్న, మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్ ముఖర్జీ గతంలో ప్రతీయేటా దుర్గా నవరాత్రులలో తన స్వగ్రామానికి వచ్చి, నాలుగు రోజుల పాటు పూజలు చేస్తుండేవారు. ఈ సందర్భంగా ప్రణబ్ స్వయంగా చండీపాఠాన్ని చదివేవారు. దీనిని ఉత్సవ నిర్వాహకులు రికార్డు చేశారు. 

ఇప్పుడు ఈ రికార్డింగ్‌ను రాబోయే దుర్గా నవరాత్రులలో ఉత్సవాలు జరిగే వేదికల వద్ద వినిపించనున్నారు. ఈ సందర్భంగా  ప్రణబ్ కుటుంబానికి సన్నిహితుడు, దుర్గాపూజల నిర్వాహకులు రవి చట్టోరాజ్ మాట్లాడుతూ తాము దుర్గాపూజా ఉత్సవాల్లో ప్రణబ్ ముఖర్జీ ఆలపించిన చండీపాఠాన్ని వాడవాడలా వినిపించాలనుకుంటున్నామని తెలిపారు.

ఇదిలా ఉండగా.. ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన భౌతిక కాయానికి మంగళవారం మధ్యాహ్నం దిల్లీలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు.

ఆయన మెదడులో గడ్డ కట్టిన రక్తాన్ని తొలగించేందుకు శస్త్రచికిత్స కోసం ఆగస్ట్ 10న దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేర్చారు.

శస్త్రచికిత్స తరువాత ఆయనకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో చికిత్స అందించారు.అయితే.. సర్జరీ అనంతరం ప్రణబ్ ముఖర్జీ కోమాలోకి వెళ్లారు. ఆర్మీ ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తుూ వచ్చారు. కాగా.. ప్రణబ్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత ట్విటర్‌లో వెల్లడించారు.