మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. శివసేన అంతర్గత పోరుతో రాష్ట్రంలో ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. రెబల్ ఎమ్మెల్యేల గ్రూపు శివసేన బాలాసాహెబ్ పేరుగా పెట్టినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఉద్ధవ్ ఠాక్రే రంగంలోకి దిగారు. బాలాసాహెబ్ ఠాక్రే పేరునూ ఎవ్వరూ వాడుకోవడానికి వీల్లేదని పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం జరిగింది. అంతేకాదు, ఈసీని ఆశ్రయించి కూడా బాలాసాహెబ్ పేరును ఎవరూ పెట్టుకోకుండా చూడాలని విజ్ఞప్తి చేయనున్నారు. 

ముంబయి: శివసేన సారథ్యంలోని మహా వికాస్ అఘాదీ సర్కారును ధిక్కరిస్తూ మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్‌నాథ్ షిండే మెజార్టీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని బీజేపీ పాలిత రాష్ట్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. తొలుత గుజరాత్‌కు వెళ్లి ఆ తర్వాత అసోంకు చేరారు. ఉద్ధవ్ ఠాక్రేకు, ఏక్‌నాథ్ షిండేకు మధ్య ఫోన్‌లో సంభాషణ జరిగినా రాజీ కుదరలేదు. ఏక్‌నాథ్ షిండే అధికారంలోని సంకీర్ణ కూటమిని సవాల్ చేయడమే కాదు.. శివసేన పార్టీ నాయకత్వంపైనా కన్నేసినట్టు కథనాలు వచ్చాయి. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వానికి సమాంతరంగా పార్టీలో చీలిక తెచ్చి ఆ ఫ్యాక్షన్‌కు నాయకత్వం వహించనున్నట్టు రిపోర్ట్స్ వచ్చాయి. 

ఏక్‌నాథ్ షిండే శిబిరానికి చేరిన శివసేన ఎమ్మెల్యే దీపక్ కేసర్కార్ సంచలన విషయాన్ని ప్రకటించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల గ్రూపు ఏ పార్టీలోనూ విలీనం కారని పేర్కొన్నారు. వారి గ్రూపునకు శివసేన బాలాసాహెబ్‌గా పేరుపెట్టినట్టు వివరించారు. దీంతో రాజకీయాలు మరో మలుపు తిరిగినట్టయ్యాయి. 

దీంతో ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసి ఆయన నాయకత్వానికే గండికొట్టారనే అసంతృప్తి శివసేన కార్యకర్తల్లో కనిపిస్తున్నది. పార్టీలో చీలికను ఆయన దాదాపు ఖరారు చేసినంత పని చేశారు. అయితే, తాజాగా, దీపక్ కేసర్కార్ వ్యాఖ్యలపై ఏక్‌నాథ్ షిండే రియాక్ట్ అయ్యారు. తాము బాలాసాహెబ్ సైనికులం అని వివరించారు. సెపరేట్ గ్రూప్‌గా ఏర్పడటానికి తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు. సీఎన్ఎన్ న్యూస్ 18కు ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. శివసేనలో ప్రత్యేక గ్రూపు ఏర్పడిందనే ఊహాగానాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కాగా, ఇదే తరుణంలో శివసేన కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. శివసేన శనివారం ముంబయిలో నిర్వహించిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, ఎవ్వరూ బాల్ ఠాక్రే పేరుగానీ, శివసేన పేరుగాని వాడటానికి వీల్లేదని స్పష్టం చేశారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో దీనిపై ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. అంతేకాదు, శివసేన ఎన్నికల సంఘాన్ని కూడా ఆశ్రయించనున్నట్టు తెలిసింది. ఏ రెబల్ క్యాంప్ అయినా సరే.. బాలా సాహెబ్ ఠాక్రే పేరు వినియోగించకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని త్వరలోనే కోరనుంది.