ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్  భారతదేశంలోని ఇతర కేంద్రపాలిత ప్రాంతాలతో సమాన స్థాయికి వచ్చింది. బిజెపి ఈ నిర్ణయాన్ని ఇప్పుడేదో కొత్తగా తీసుకున్నది కాదు. కాశ్మీర్ భారతదేశంలో విలీనమైన నాటి నుండే వారు దీనికోసం పోరాడుతున్నారు. బీజేపీ పూర్వపు సంస్థ జనసంఘ్ కూడా ఇందుకోసం తీవ్రంగా కృషి చేసింది. ఈ కృషిలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ గురించి. 

 

అప్పట్లో కాశ్మీర్ లో ఇతర రాష్ట్రాల వ్యక్తులు ప్రవేశించాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి. దీన్నీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన దీన్ని వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష కూడా చేశారు. అప్పటి ప్రధాని నెహ్రూకు ఎన్నో లేఖలు కూడా రాసారు. ఒకసారి పార్లమెంటులో మాట్లాడుతూ " ఏక్ దేశ్ మే దో నిషాన్, దో సంవిధాన్, దో ప్రధాన్ నహీ చెలేంగే నహీ చెలేంగే " ( ఒకే దేశంలో రెండు చిహ్నాలు, రెండు రాజ్యరంగాలు, ఇద్దరు ప్రధానులు ఉండరాదు) అంటూ కాశ్మీర్ ను ఉద్దేశిస్తూ అన్నారు. కాశ్మీరులో గుర్తింపు కార్డు నియమాన్ని రద్దు చేశారంటే అది శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోరాటం వల్లనే. 

ఇదేదో కేవలం శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఒక్కడి ఆలోచన మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇది వారి పార్టీ సిద్ధాంతాల్లో ఒకటి. ఆ సిద్ధాంతానికే కట్టుబడి 2019 ఎన్నికల్లో బిజెపి తమ మానిఫెస్టోలో ఈ విషయాన్ని చేర్చింది. అప్పటి బిజెపి కార్యకర్త ఇప్పటి ప్రధాని, నరేంద్ర మోడీ కూడా దీనిపైన ఉద్యమించాడు. కాశ్మీర్ కూడా అన్ని రాష్ట్రాల్లానే, వేరుగా చూడాల్సిన అవసరం లేదు అనే పార్టీ సిద్ధాంతాన్ని ఆ పార్టీలోని అందరూ బలంగా విశ్వసిస్తారు. 

 

 

నేడు పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టగానే శ్యామ ప్రసాద్ ముఖర్జీ కలలు సాకారమయ్యాయని నెటిజన్లు తెగ పోస్టులు పెడుతున్నారు. బిజెపి జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ ఈ సందర్భంగా మోడీ అప్పట్లో ఆర్టికల్ 370 తొలగింపు కోసం దీక్షలో కూర్చున్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి "మాట నిలుపుకున్నారు"  అని రాశారు. మరో ట్వీట్ లో శ్యామ ప్రసాద్ ముఖర్జీతో సహా ఎందరో బలిదానాలను నేడు గౌరవించారు అని అన్నారు. 

 

 

 

మాజీ ఆర్ధిక మంత్రి  అరుణ్ జైట్లీ సైతం మోడీకి అభినందనలు తెలుపుతూనే చారిత్రాత్మక తప్పును సరిదిద్దారని పేర్కొన్నారు. మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఇదో గొప్ప చారిత్రాత్మక సాహసోపేత నిర్ణయంగా అభివర్ణించారు.