కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిని శాంతింపజేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 విడతలుగా చర్చలు జరిపింది.

అయినప్పటికీ ఇరు పక్షాలకు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సాగు చట్టాలపై రైతు సంఘాల నేతలతో చర్చలకు తాము ఎప్పుడైనా సిద్ధంగానే వున్నట్లు ప్రకటించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.

వ్యవసాయ చట్టాలకు సంబంధించిన వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందని, అందువల్ల ఈ చట్టాలను అమలు చేయలేమని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉందని తోమర్ తెలిపారు.

మరోవైపు రైతుల నిరసనలకు గురువారం బీఎస్పీ జాతీయ అధికార ప్రతినిధి సుధీంద్ర భదోరియా మద్దతు తెలిపారు. రైతుల డిమాండ్లపై కేంద్రం ఇంకా ఆలస్యం చేయరాదని ఆయన అభిప్రాయపడ్డారు.