ఇండియన్ కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటోకు బదులు రవీంద్రనాథ్ ఠాగూర్, ఏపీజే అబ్దుల్ కలాం ఫొటోలు వేసే ఆలోచనలో ఆర్‌బీఐ ఉన్నట్టు కొన్ని కథనాలు వచ్చాయి. అయితే, ఆర్‌బీఐ తాజాగా, ఆ కథనాలను ఖండించింది. తమ వద్ద అలాంటి ప్రతిపాదనలు ఏమీ లేవని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: కొన్ని రోజులుగా ఓ వార్త ప్రచారంలో ఉన్నది. కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటోకు బదులు ఇద్దరు ప్రముఖుల చిత్రాలు వేయాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు ఆ వార్త సారాంశం. నోబెల్ పురస్కార గ్రహీత, రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్, మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఫొటోలను మహాత్మా గాంధీ ఫొటోకు బదులుగా ఒక రూపాయి నోటుపై వేయాలని ఆర్బీఐ కూడా ఆలోచనలు చేస్తున్నట్టు కథనాలు వచ్చాయి. తాజాగా, ఈ కథనాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయంగా స్పందించింది.
ప్రస్తుతం ఉన్న కరెన్సీ, బ్యాంక్ నోట్లలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆర్బీఐ తాజాగా స్పష్టం చేసింది. కరోన్సీ, బ్యాంకు నోట్లపై మహాత్మా గాంధీ ఫొటోకు బదులుగా ఇతరు ప్రముఖుల ఫొటోలు వేసే ఆలోచనలో ఆర్బీఐ ఉన్నదని కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయని ఈ సందర్భంగా ఆర్బీఐ గుర్తు చేసింది. అయితే, ఆర్బీఐ దగ్గర అలాంటి ప్రతిపాదనలు ఏమీ లేవని విస్పష్టంగా చెప్పేసింది.
కాగా, ఆర్బీఐ వార్షిక రిపోర్టులో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్యధిక డినామినేషన్ గల రూ. 2000 నోట్ల చలామణి భారీగా తగ్గినట్టు వార్షిక రిపోర్టు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి వరకు చూస్తే.. దేశంలో చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో 1.6 శాతం మాత్రమే రూ. 2000 నోట్లు ఉన్నాయని తెలిపింది. విలువ పరంగా చూస్తే 214 కోట్లుగా ఉన్నది.
అయితే, రూ. 500 నోట్ల చలామణి భారీగా పెరిగినట్టు ఈ రిపోర్టు వెల్లడించింది. 4,554.68 కోట్ల మేరకు ఈ నోట్లు చలామణిలో ఉన్నాయి. అంతకు క్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 3,867.90 కోట్లుగా ఉండటం గమనార్హం.
కాగా, కవి రబీంద్రనాథ్ ఠాగూర్, సైంటిస్టు ఏపీజే అబ్దుల్ కలాం బొమ్మలను వాటర్ మార్కులుగా ముద్రించాలని ఆర్‌బీఐ భావిస్తున్నట్టు కథనాలు వచ్చాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రిజర్వుబ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే దీనిపై తుదినిర్ణయాన్ని తీసుకోవచ్చని ప్రచారం జరిగింది. ప్రత్యేకించి - 2000 రూపాయల నోటుపై మహాత్మగాంధీతో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం వాటర్ మార్కులను ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ ఇంటర్నల్ కమిటీ ప్రతిపాదించిందని, దీన్ని గవర్నర్ శక్తికాంత దాస్ తుది ఆమోదం తెలపాల్సి ఉందని ఆ కథనాలు పేర్కొన్నాయి.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం.. అగ్రరాజ్యం అమెరికాను అనుసరిస్తోందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమయ్యాయి. అమెరికా ముద్రించే డాలర్ల మీద వేర్వేరు ప్రముఖలు బొమ్మలు ఉంటాయి. జార్జ్ వాషింగ్టన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ జెఫర్సన్, ఆండ్రూ జాక్సన్, అలెగ్జాండర్ హామిల్టన్, అబ్రహం లింకన్.. వంటి ప్రముఖుల పేర్ల తో డాలర్.. చలామణిలో ఉంటోంది. అదే తరహాలో రూపాయి నోట్ల మీద కూడా మహాత్మాగాంధీ బొమ్మ మాత్రమే కాకుండా.. ఇతర ప్రముఖుల ఫొటో లను కూడా ముద్రించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వచ్చాయి.
