రూ. 2 వేల నోట్లను మార్చుకునేందుకు గడువు పొడిగించిన ఆర్‌బీఐ.. పూర్తి వివరాలు ఇవే..

రూ. 2వేల నోట్లను మార్చుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరో అవకాశం ఇచ్చింది.

RBI extends deadline to exchange rs 2000 notes till October 7 ksm

రూ. 2వేల నోట్లను మార్చుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరో అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు రూ. 2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్‌బీఐఐ మే నెలలో సూచించిన సంగతి తెలిసిందే. అయితే ఆ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో రూ. 2వేల నోట్లను మార్చుకునేందుకు మరొక అవకాశం కల్పిస్తూ ఆర్బీఐ ప్రకటన చేసింది. అక్టోబరు 7వ తేదీలోగా రూ. 2వేల నోట్లను సమీప బ్యాంకుల్లో మార్చుకోవచ్చని తెలిపింది. ఈ  మేరకు ఆర్‌బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. 

‘‘ఉపసంహరణ ప్రక్రియకు నిర్దేశించిన గడువు ముగిసినందున.. సమీక్ష ఆధారంగా రూ. 2000 నోట్ల డిపాజిట్/మార్పిడి కోసం ప్రస్తుత ప్రక్రియను 2023 అక్టోబర్ 07 వరకు పొడిగించాలని నిర్ణయించాం’’ అని ఆర్‌బీఐ ప్రకటనలో తెలియజేసింది. ఇక,  అక్టోబర్ 8 నుంచి డిపాజిట్/మార్పిడి కోసం బ్యాంకులు రూ. 2,000 నోట్లను స్వీకరించడాన్ని నిలిపివేయనున్నాయి. అయినప్పటికీ ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను మార్పిడి చేసుకునేందుకు ఆర్‌బీఐ వెసులుబాటు కల్పించనుంది. 

అక్టోబర్ 8 నుంచి దేశంలోని 19 ఆర్‌బీఐ ఇష్యూ కార్యాలయాల్లో వ్యక్తులు ఒకేసారి రూ. 20,000 పరిమితి వరకు రూ. 2000 నోట్ల మార్పిడిని కొనసాగించవచ్చని కూడా ఆర్‌బీఐ తెలిపింది. 

ఇక, ఈ ఏడాది మే 19 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లలో..  రూ. 3.42 లక్షల కోట్ల విలువైన నోట్లను అందుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. దీంతో సెప్టెంబర్ 29 నాటికి రూ. 0.14 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios