లక్ష్మీ కో ఆపరేటివ్ బ్యాంక్‌ లైసెన్స్‌ను కేంద్రీయ బ్యాంక్ ఆర్బీఐ రద్దు చేసింది. బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించకుండా నిషేధించింది. వెంటనే లిక్విడేటర్‌ను అపాయింట్ చేసి డిపాజిటర్ల సొమ్ము తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. 

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం మహారాష్ట్రకు చెందిన లక్ష్మీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసింది. ఈ బ్యాంక్ వద్ద సరిపడా మూలధనం లేదని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది. లిక్విడేషన్ ప్రక్రియలో భాగంగా డిపాజిటర్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కింద రూ. 5 లక్షల వరకు పొందవచ్చని వివరించింది. ఈ ఆదేశాలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది.

మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన లక్ష్మీ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకింగ్ బిజినెస్ చేయకుండా ఆర్బీఐ నిషేధించింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. బ్యాంక్‌ను వెంటనే మూసేయాలని, డిపాజిటర్లకు వారి సొమ్ము తిరిగి చెల్లించడానికి లిక్విడేటర్‌ను నియమించాలని మహారాష్ట్ర కోఆపరేషన్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్‌ను ఆదేశించింది.

లిక్విడేషన్ ప్రక్రియలో భాగంగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ లేదా డీఐసీజీసీ కింద ప్రతి డిపాజిటర్.. డిపాజిట్ ఇన్సూరెన్స్ ద్వారా రూ. 5 లక్షల వరకు పొందవచ్చని వివరించింది.

అయితే, బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం, 99 శాతం మంది డిపాజిటర్లు డీఐసీజీసీ నుంచి వారి ఫుల్ అమౌంట్ పొందడానికి అర్హులని పేర్కొంది.