Asianet News TeluguAsianet News Telugu

‘జెండా కొనకుంటే రేషన్ సరుకులు ఇవ్వం’ వీడియోపై బీజేపీ ఎంపీ ఫైర్.. సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యలు

హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ దాదాపు దేశవ్యాప్తంగా విజయవంతంగా సాగుతున్నది. కానీ, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఈ క్యాంపెయిన్‌లో చోటుచేసుకున్న ఓ అపశృతిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పేదలు తమ రేషన్ కార్డుల ద్వారా సరుకులు తీసుకోవడానికి వెళ్తే.. కచ్చితంగా జెండాలు కొనాల్సిందేనని రూ. 20 వసూళ్లకు పాల్పడ్డారని తెలిపారు.
 

ration card holders forced to buy national flag.. bjp mp varun gandhi flags by video on social media
Author
New Delhi, First Published Aug 10, 2022, 1:49 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా విజయవంతంగా ముందుకు సాగుతున్నది. చాలా మంది ఇప్పటికే జాతీయ జెండాలను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నారు. బీజేపీ విమర్శకులు, మోడీ విమర్శకులు సైతం.. ఈ క్యాంపెయిన్‌లో భాగం పంచుకున్నారు. ఈ క్యాంపెయిన్ దాదాపుగా విజయవంతం అయినట్టే. కానీ, వరుణ్ గాంధీ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో చూస్తే కొన్ని అభ్యంతరాలు రాకమానవు.

పేద ప్రజలు చౌక ధరల దుకాణం వద్దకు తమ రేషన్ కార్డులు వెంటపెట్టుకుని వెళ్లారు. వారు అక్కడ సబ్సిడీ కింద ధాన్యాలు కొనాలని అనుకున్నారు. కానీ, ఆహార గింజలతో పాటు అక్కడే ఉన్న జెండాలు కొనుగోలు చేయకపోవడంపై డీలర్ సిబ్బంది సీరియస్ అయ్యారు. అంతేకాదు.. జెండాలు కొనకుంటే రేషన్‌లోని కొన్ని సరుకులను ఇవ్వబోమని బెదిరించినట్టూ ఆ వీడియోను పేర్కొంటూ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు.

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పేదలపై మరింత భారం మోసేవిగా ఉంటే.. అది చాలా బాధాకరం అని వరుణ్ గాంధీ పేర్కొన్నారు. రేషన్ కార్డుదారులు జాతీయ జెండా కొనాలని బలవంత పెడుతున్నారని వివరించారు. లేదంటే.. సరుకుల్లో కొంత వాటా కోత పెడుతామని హెచ్చరించారని ఆవేదన చెందారు. త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడి గుండెల్లో ఉంటుందని ఆయన తెలిపారు. కానీ, పేదల ముద్దను కూడా జాతీయ జెండాకు వెలగా లాక్కోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన పరోక్షంగా ఈ విమర్శలు చేశారు.

హర్యానాలోని కర్నాల్‌కు చెందిన ఓ న్యూస్ పోర్టల్ ఈ వీడియోను రికార్డ్ చేసింది. రేషన్ షాపులోకి వెళ్లి సరుకులు తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా రూ. 20 పెట్టి జాతీయ జెండా కొనాల్సిందేనని పట్టుబడుతున్న వీడియోను రికార్డ్ చేసింది. రేషన్ డిపో ఉద్యోగిగా కనిపిస్తున్న ఓ ఉద్యోగి ఆ వీడియో కొన్ని వ్యాఖ్యలు చేశారు. రేషన్ కార్డు మీద ధాన్యాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ అదనంగా రూ. 20 పెట్టి జాతీయ జెండా కొనుగోలు చేయాల్సిందేనని, వాటిని తమ ఇంటి వద్ద ప్రదర్శించుకోవాల్సిందేనని తమకు ఆదేశాలు వచ్చాయని ఆ సిబ్బంది తెలిపారు. రేషన్ సరుకులు తీసుకుని వెళ్లేవారందరికీ జెండాను అమ్మాలని తమకు ఆదేశాలు వచ్చినట్టు వివరించారు. తమకు ఆదేశాలు ఉన్నాయని, వాటిని పాటించడం తప్పా తాము మరేం చేయగలం అని పేర్కొన్నారు.

ఈ వీడియో వైరల్ కాగానే.. ఆ రేషన్ డిపో యజమాని లైసెన్స్‌ను పై అధికారులు రద్దు చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ఇలాంటి అక్రమాలకు ఎవరు పాల్పడినా వెంటనే తమకు తెలియజేయాలని డిప్యూటీ కమిషనర్ అనిశ్ యాదవ్ తెలిపారు. రేషన్ షాపుల్లో చిల్లర కొరత లేదా ఇతర సమస్యలకు కన్వీనియెన్స్‌గా ఈ జెండాలు అమ్ముతున్నారని, ఆ జెండా కొనుగోలు రేషన్ కార్డుదారుల స్వచ్ఛంద నిర్ణయం అని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios