కరోనా మహమ్మారి మరోసారి విజృంభించడం మొదలుపెట్టింది. కరోనా తగ్గిపోయిందని ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అనూహ్యంగా అది యూటర్న్ తీసుకుంది. సరిగ్గా ఏడాది క్రితం ఎప్పుడైతే.. కరోనా దేశంలో కలకలం సృష్టించడం మొదలుపెట్టిందో.. మళ్లీ అదే సమయానికి తిరిగి విజృంభించడం మొదలుపెట్టింది. పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ లు విధించడం కూడా మొదలుపెట్టారు. కాగా.. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ప్రభావం మరింత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,101 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ పరిస్థితులను గమనించిన కేజ్రీవాల్ సర్కారు బహిరంగ ప్రదేశాల్లో హోలీ తదితర ఉత్సవాలు నిర్వహించడంపై నిషేధం విధించింది. హోలీ సంబరాలకు బ్రేక్ వేశారు. 

అలాగే కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చేవారికి ర్యాండమ్ టెస్టులు చేయనున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్లు, బస్టాండులు, మొదలైన ప్రాంతాల్లో ఈ విధమైన టెస్టులు చేయనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది. కరోనాతో ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది.