కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ ఖండించింది. ఈ వార్తలు అవాస్తవమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఓ ప్రకటనలో ఖండించారు.

అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసి నెలలు కావొస్తున్నా ఇంకా కొత్త అధ్యక్షుడిని ఎన్నికకాలేదు. వయోభారంతో బాధపడుతూనే సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్లు ఆమెకు ఓ లేఖ రాశారు. హైకమాండ్‌తో పాటు అంతర్గత సమస్యలపైనా చర్చించాల్సిందిగా 20 మంది లేఖ రాశారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సోమవారం ఆన్‌లైన్ సమావేశం నిర్వహించనుంది.

అంతకుముందు ఈ లేఖపై సోనియా స్పందించారని, అందరం కలిసి ఉమ్మడిగా కొత్త అధ్యక్షుడిని వెతుకుదామని, పార్టీ సారథ్య బాధ్యతలను మోయలేనని వారికి బదులిచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.

కాగా, సోమవారం జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక, పార్టీ కార్యాలయ మార్పు వంటి అంశాలపై కీలకంగా చర్చించనున్నట్లు  సమాచారం.

ఒకవేళ రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు విముఖంగా ఉంటే... గట్టి నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించాలని లేదంటే అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని పలువురు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నాటి సీడబ్ల్యూసీ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.