చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో విషాదకర ఘటన చోటు చేసుకొంది. ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలేక  ప్రియుడు కూడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

రాష్ట్రంలోని విల్లుపురం జిల్లాలోని పాత నన్నవరంలో డిగ్రీ చదువుకొనే శ్రీలత అనే విద్యార్ధిని ఆన్ లైన్ క్లాసులకు హాజరు కావడం కోసం సెల్ ఫోన్ కావాలని తండ్రిని అడిగింది. అయితే తండ్రి మాత్రం ఆమెకు సెల్ ఫోన్ కొనివ్వలేదు.

దీంతో మనస్థాపానికి గురైన శ్రీలత ఆత్మహత్య చేసుకొంది. ఈ విషయం తెలుసుకొన్న శ్రీలత ప్రియుడు రాము కూడ తీవ్రంగా కుంగిపోయాడు.. శ్రీలత అంత్యక్రియలు చేస్తున్న విషయాన్ని తెలుసుకొన్న రాము అక్కడికి చేరుకొన్నాడు. శ్రీలత చితికి నిప్పంటించిన వెంటనే రాము ఆ చితిపై పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తన ప్రియురాలు లేకుండా తాను బతకలేననే ఉద్దేశ్యంతో రాము ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామును కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయిందని స్థానికులు చెప్పారు. అప్పటికే మంటలు వ్యాప్తి చెందడంతో ఏమీ చేయలేకపోయినట్టుగా స్థానికులు చెప్పారు.

ఈ విషయమై పోలీసులకు సమాచారం అందడంతో ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.