Asianet News TeluguAsianet News Telugu

ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. యోగా గురు బాబా రామ్‌దేవ్ పై కేసు..  

ముస్లింలు, మైనార్టీలకు వ్యతిరేకంగా ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకటనపై నిరసన వ్యక్తం చేస్తూ.. రాజస్థాన్ లోని పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టారంటూ స్వామి రామ్‌దేవ్‌పై బార్మర్ జిల్లాలోని చౌతాన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.  

Ramdev Charged For Hate Speech At Event In Rajasthan's Barmer
Author
First Published Feb 5, 2023, 10:41 PM IST

ముస్లింలు, మైనార్టీలపై ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇతర మతాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయం మరింత తీవ్రమైంది. ఈ క్రమంలో రాజస్థాన్ లోని చౌతాన్ పోలీస్ స్టేషన్‌లో రామ్‌దేవ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టడం, ఇతర మతాల వారిని రెచ్చగొట్టడం వంటి పలు సెక్షన్ల కింద బాబాపై కేసు నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు చౌతాన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరోవైపు శనివారం ఒక్కరోజు ముందే ఏడీఎంకు సీఎం పేరిట వినతి పత్రం అందజేసి చర్యలు తీసుకోవాలని ముస్లిం వర్గీయులు డిమాండ్‌ చేశారు.గోరో కా తలా ధనౌ నివాసి పథాయ్ ఖాన్ కుమారుడు మథినా ఖాన్ ఫిబ్రవరి 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాబా రామ్‌దేవ్ ఇస్లాం మతం , దాని అనుచరులు , ఇస్లాం విశ్వాసాన్ని విశ్వసించే వ్యక్తుల గురించి ఉద్దేశపూర్వకంగా వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారని తెలిపారు. ఇది ఇస్లాం మతంపై విశ్వాసం ఉన్న కోట్లాది మంది అనుచరుల మత మనోభావాలను కూడా దెబ్బతీశారనీ, అలాగే.. బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలు వివిధ మతాల మధ్య దూరాన్ని పెంచి సామరస్యాన్ని చెడగొట్టేలా ఉన్నాయని, పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇంతకీ  ఏం జరిగింటే..? 

యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఫిబ్రవరి 2న బార్మర్‌లో జరిగిన ఒక మతపరమైన సభలో ప్రసంగిస్తూ ఇస్లాం మరియు క్రైస్తవులకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం మతం అంటే నమాజ్ చేయడమేననీ, నమాజ్ చేయడం మాత్రమే కీలకమని అన్నారు. నమాజ్ చేసిన తర్వాత..వారు ఏమి చేసినా..? వారు ఏది చేసినా..?  ప్రతిదీ సమర్థించబడుతుంది. వారు  హిందూ అమ్మాయిలను ఎత్తుకెళ్లినా, జిహాద్ పేరుతో తీవ్రవాదులుగా మారినా, మీ మనసులో ఏది అనిపిస్తే అది చేయండి, కానీ రోజుకు 5 సార్లు నమాజ్ చదవండి. అప్పుడు ప్రతిదీ సమర్థించబడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మైనారిటీ కమిషన్ చైర్మన్ అసంతృప్తి  

బాబా ప్రకటనను రాజస్థాన్ మైనారిటీల కమిషన్ ఛైర్మన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రఫీక్ ఖాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది పెద్ద కుట్రగా అభివర్ణించారు. మీడియాతో రఫీక్ ఖాన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆశీర్వాదంతో రామ్‌దేవ్ కంపెనీలు పురోగమిస్తున్నాయని, అందుకే ఆయనను రాజస్థాన్‌లో మతతత్వం, కులతత్వం వ్యాప్తి చేసేందుకు పంపారని అన్నారు. వారు కుట్రతో రాజస్థాన్‌కు వచ్చారు. యోగా గురువు ఓ మతానికి వ్యతిరేకంగా అయినా తప్పుడు వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేటు. ఏ మతమూ శత్రుత్వాన్ని బోధించదు. బాబా రామ్‌దేవ్‌పై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

అసదుద్దీన్ ఒవైసీ పార్టీ హెచ్చరిక

ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా బాబా చేసిన వివాదాస్పద ప్రసంగంపై అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) తీవ్రంగా ఖండించింది. వీధుల్లో నిరసన తెలుపుతోంది. బాబా వివాదాస్పద ప్రకటనను వ్యతిరేకిస్తూ.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్టీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు లేఖ రాసింది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు తెలుపుతామని హెచ్చరించింది. బాబా రామ్‌దేవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, AIMIM పార్టీ సభ్యుడు మౌలానా బర్కత్ అలీ నేతృత్వంలో ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు ముఖ్యమంత్రి పేరు మీద జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios