థానే: మహారాష్ట్రలో దిగ్భ్రాంతి కలిగించే సంఘటన జరిగింది. కేంద్ర సహాయ మంత్రి రామదాస్ అథవాలేను ఓ వ్యక్తి తోసేసి, చెంపపై చెల్లుమనించాడు. ఈ సంఘటన శనివారం రాత్రి అంబర్నాథ్ పట్టణంలో చోటు చేసుకుంది. 

వివరాలు ఇలా ఉన్నాయి.... మంత్రి ప్రసంగించి వేదిక దిగివచ్చాడు. ఈ సమయంలో అకస్మాత్తుగా ఓ వ్యక్తి తోసుకుని వచ్చి మంత్రిని తోసేసి, అతని ముఖంపై కొట్టాడు.

మంత్రిని కాపాడేందుకు కొంత మంది అనుచరులు ముందుకు వచ్చారు. దాడి చేసిన వ్యక్తిని పక్కకు తోసేసి అతనిపై దాడి చేశారు. అథవాలే వ్యక్తిగత బాడీగార్డులు, పోలీసులు అతన్ని వారి నుంచి తప్పించి పక్కకు తీసుకుని వెళ్లారు. 

ఈ దాడికి గల కారణాలు తెలియరాలేదు. దాడి చేసిన యువకుడు భారత రిపబ్లికన్ పార్టీ కార్యకర్తగా తెలుస్తోంది. రిపబ్లికన్ పార్టీ ఎన్డీఎలో భాగస్వామిగా ఉంది. 

ఈ ఘటనతో షాక్ తిన్న అథవాలే ఆ తర్వాత ముంబైకి బయలుదేరి వెళ్లారు. పోలీసులు యువకుడి ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు .