రామచరితమానస్ లో పొటాషియం సైనైడ్ ఉంది - బీహార్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడ్డ బీజేపీ
గత కొంత కాలం నుంచి రామచరితమానస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ మరో సారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. రామచరితమానస్ లో పోటాషియం సైనైడ్ ఉందని అన్నారు. అందుకే తాను దానిని వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.
రామాయణం ఆధారంగా వచ్చిన హిందూ మత గ్రంథమైన రామచరిత్మానస్ ను పొటాషియం సైనైడ్ తో పోల్చి బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ దినోత్సవం సందర్భంగా బీహార్ హిందీ గ్రంథ్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రామచరితమానస్‌లో పొటాషియం సైనైడ్ ఉందని, అది ఉన్నంత వరకు దానిని వ్యతిరేకిస్తూనే ఉంటామని చెప్పారు.
ఇండియా టు డే కథనం ప్రకారం.. ‘‘మీరు యాభై ఐదు రకాల వంటకాలను వడ్డించి, అందులో పొటాషియం సైనైడ్ కలిపితే,మీరు దానిని తింటారా? హిందూ మత గ్రంథాల విషయంలోనూ ఇదే పరిస్థితి’’ అని చంద్రశేఖర్ పేర్కొన్నారు. బాబా నాగార్జున, లోహియా సహా పలువురు రచయితలు కూడా దీనిపై విమర్శలు చేశారని ఆయన అన్నారు. రామచరిత మానస్ పై తన అభ్యంతరం దృఢంగా ఉందని తెలిపారు. అది తన జీవితాంతం ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా దీనిపై వ్యాఖ్యానించారని బీహార్ మంత్రి తెలిపారు.
గుంతలో అడుగు పెట్టే వారి కులాలు మారకపోతే ఈ దేశంలో రిజర్వేషన్లు, కుల గణన అవసరం ఉంటుందని చంద్రశేఖర్ అన్నారు. కాగా.. ఈ వ్యాఖ్యలపై బీజేపీపై స్పందించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై మండిపడింది. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడుతూ..రామచరిత మానస్ పై మంత్రి చంద్రశేఖర్ నిరంతరం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. నితీష్ కుమార్ ఈ మాట వినడం లేదా అని ప్రశ్నించారు. నితీశ్ కుమార్ సనాతనను నిరంతరం అవమానిస్తున్నారని మండిపడ్డారు.చంద్రశేఖర్ కు ఏదైనా సమస్య ఉంటే మతం మార్చుకోవాలని ఆయన సూచించారు.
కాగా.. బీహార్ లోని కేబినేట్ మినిస్టర్ గా ఉన్న చంద్ర శేఖర్.. రామచరిత మానస్ పై చేసిన వ్యాఖ్యలతో వివాదం సృష్టించడం ఇదే మొదటిసారి కాదు. రామచరితమానస్ సమాజంలో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందని జనవరిలోనే ఆయన వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచారు. ‘‘ప్రేమ, ఆప్యాయతలతో దేశం గొప్పగా మారుతుంది. రామచరిత మానస్, మనుస్మృతి, బంచ్ ఆఫ్ థాట్స్ వంటి పుస్తకాలు ద్వేషానికి, సామాజిక విభజనకు బీజాలు వేశాయి. అందుకే ప్రజలు మనుస్మృతిని తగలబెట్టారు.’’ అని అన్నారు.