లక్నో: రామజన్మభూమి ట్రస్ట్ బ్యాంకు ఖాతా నుండి భారీ ఎత్తున నిధులను కొందరు నకిలీ చెక్కులతో డ్రా చేశారు.ఈ విషయమై రామజన్మభూమి ట్రస్ట్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రామ మందిరం నిర్మాణం కోసం రామజన్మభూమిట్రస్ట్ విరాళాలను సేకరిస్తోంది. ఈ బ్యాంకు ఖాతా నుండి రూ. 6 లక్షలను దుండగులు డ్రా చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.

రూ.2.5 లక్షలు, రూ. 3.5 లక్షలను నకిలీ చెక్కులను ఉపయోగించి డ్రా చేశారు. ఈ ఏడాడి సెప్టెంబర్ 1, 3 తేదీల్లో నకిలీ చెక్కులను ఉపయోగించి రూ. 6 లక్షలను డ్రా చేశారు. ఈ నెల 9వ తేదీన రూ. 9.86 లక్షలను డ్రా చేసేందుకు ప్రయత్నించారు.

ఈ విషయమై అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు ట్రస్టు సభ్యులకు ఫోన్ చేస్తే అసలు విషయం వెలుగు చూసింది. తాము బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసేందుకు ఎవరిని కూడ పంపలేదని ప్రకటించారు.

క్లోనింగ్ చెక్కుల ద్వారా ఈ డబ్బులను డ్రా చేసినట్టుగా గుర్తించారు. ట్రస్ట్ కార్యదర్శి రాయ్ తో పాటు ట్రస్టు సభ్యుడి సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేశారు.ఈ డబ్బులను డ్రా చేసి పంజాబ్ నేషనల్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్టుగా అధికారులు గుర్తించారు.