జనవరి 22, 2024న అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన జరగనున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. నేపాల్, జనక్‌పూర్‌లోని సీత జన్మస్థలం నుండి వచ్చిన ప్రత్యేక బహుమతులతో పాటు.. శ్రీలంక, థాయ్‌లాండ్ వంటి దేశాల నుండి అనేక కానుకలు వెల్లువెత్తుతున్నాయి.
అయోధ్య : అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పూజలు మంగళవారంనుంచే మొదలయ్యాయి. అసలు వేడుకకు ఇంకా కొద్దిరోజులే మిగిలి ఉంది. ఈ క్రమంలో భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. దాదాపు 500 సంవత్సరాల తర్వాత బాలరాముడి విగ్రహాన్ని ఆయన జన్మస్థలంలో ప్రతిష్టించే కార్యక్రమం కోసం దేశవిదేశాల్లోని భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికోసం అయోధ్యకు ప్రత్యేక బహుమతులు పంపడంతోపాటు.. వేడుకలో భాగం కావడానికి ప్రత్యేకమైన మార్గాలను ఎంచుకుంటున్నారు.
సీత జన్మస్థలం, నేపాల్‌లోని జనక్‌పూర్ నుండి 3,000కు పైగా బహుమతులు అయోధ్యకు చేరుకున్నాయి. దీంతో ఈ వేడకకు భారీ వైభవం వచ్చింది. ఈ వారం నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్ రామజానకి ఆలయం నుండి అయోధ్యకు దాదాపు 30 వాహనాల కాన్వాయ్‌లో ఈ కానుకలు వచ్చాయి. వీటిల్లో వెండి బూట్లు, ఆభరణాలు, బట్టలు సహా అనేక రకాల బహుమతులు ఉన్నాయి.
శ్రీలంకలోని అశోక్ వాటికా నుండి ప్రత్యేక బహుమతులతో ఒక ప్రతినిధి బృందం అయోధ్యకు వచ్చింది. రావణుడు సీతను తీసుకెళ్లి, శ్రీలంకలోని అశోకవనంలో ఉంచినట్టుగా రామాయణ ఇతిహాసంలో ప్రస్తావన ఉంటుంది. ఆ అశోక్ వాటికా అనే ఉద్యానవనం నుండి ఓ రాయిని...ఈ ప్రతినిధి బృందం అయోధ్యకు తీసుకువచ్చింది.
దీంట్లో భాగంగానే థాయ్‌లాండ్‌లోని రెండు నదుల నుండి నీటిని పంపించే చర్యకు కొనసాగింపుగా.. బాలరాముడి పవిత్రోత్సవానికి థాయిలాండ్ మట్టిని పంపుతోంది. అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవానికి గుర్తుగా జరిగే ప్రార్థనలకు హాజరయ్యేందుకు హిందూ మతానికి చెందిన ప్రభుత్వ సేవకులకు మారిషస్ ప్రభుత్వం రెండు గంటల పాటు ప్రత్యేక సెలవును మంజూరు చేసింది. మారిషస్‌లో హిందూమతం అతిపెద్ద మతం, 2011లో హిందువులు జనాభాలో దాదాపు 48.5 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
యునైటెడ్ స్టేట్స్‌లోని 10 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో రాముడు, రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన 40కి పైగా బిల్‌బోర్డ్‌లు ఏర్పాటు చేశారు. విశ్వహిందూ పరిషత్ అమెరికా విభాగం జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ్ లల్లా జన్మస్థలంలో జరిగే గ్రాండ్ 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుక గురించి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన హిందువులతో కలిసి పనిచేసింది.అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభానికి కౌంట్‌డౌన్ కొనసాగుతుండగా, ఈ ప్రపంచవ్యాప్త వేడుకలు చారిత్రాత్మక సంఘటన సార్వత్రిక ప్రతిధ్వనిని నొక్కి చెబుతున్నాయి.
