Ayodhya Ram Mandir : అయోధ్య ఆలయంలో ఆరతిలో పాల్గొనే ఛాన్స్ .. రోజుకు 30 మందికే, బుకింగ్ ఎలా..?
అయోధ్య రామ మందిరం నిర్మాణమైన సంగతి తెలిసిందే. జనవరి 22న రామాలయ్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ సన్నాహకాల మధ్య ఆలయ అధికారులు ‘ఆరతి’ పాస్ బుకింగ్‌లను ప్రారంభించారు. రోజంతా నిర్వహించే పవిత్ర క్రతువులలో భక్తులు పాల్గొనేందుకు అనుమతిస్తారు.
వివాదాలు, న్యాయ పోరాటాలు ముగిసి అయోధ్య రామ మందిరం నిర్మాణమైన సంగతి తెలిసిందే. జనవరి 22న రామాలయ్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 6 వేల మంది ప్రముఖులు రామ మందిరం ప్రారంభోత్సవానికి రానున్నారని అంచనా. జనవరి 16 నుంచి 22 వరకు రామ్ లల్లా ప్రతిష్టాపన కార్యక్రమాలు జరగనున్నాయి.
ఈ సన్నాహకాల మధ్య ఆలయ అధికారులు ‘ఆరతి’ పాస్ బుకింగ్‌లను ప్రారంభించారు. రోజంతా నిర్వహించే పవిత్ర క్రతువులలో భక్తులు పాల్గొనేందుకు అనుమతిస్తారు. ఉదయం 6.30 గంటలకు శృంగార్ ఆరతి, మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ ఆరతి, రాత్రి 7.30 గంటలకు సంధ్యా ఆరతితో సహా ఇతర కార్యక్రమాల్లో భక్తులు దీనినైనా ఎంచుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా తమ పాస్‌లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో బుక్ చేసుకునే అవకాశం కల్పించారు అయోధ్య ఆలయ అధికారులు.
అయితే ఈ హారతులకు హాజరయ్యేందుకు పాస్ హోల్డర్లకు మాత్రమే అనుమతిస్తారు. భద్రతా కారణాలను దృష్టిలో వుంచుకుని ఆరతికి హాజరయ్యేందుకు కేవలం 30 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు ఆరతి పాస్ సెక్షన్ మేనేజర్ ధ్రువేష్ మిశ్రా తెలిపారు. ఆర్తి పాస్ పూర్తిగా ఉచితమని, ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డులను సమర్పించి ఆరతిని వీక్షించవచ్చని ఆయన వెల్లడించారు. ఆన్‌లైన్ ఆరతి బుకింగ్ చేసుకోవడానికి భక్తులు శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, వన్ టైమ్ పాస్ వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. ఆపై ఆరతి విభాగానికి నావిగేట్ చేసి .. కావాల్సిన తేదీ, ఆరతి రకాన్ని ఎంచుకుని అవసరమైన వివరాలు అందించాలి.
ఆరతి పాస్‌ను మంజూరు చేయడానికి ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌వర్డ్ సహా ఎంపిక చేసిన పత్రాలను అంగీకరిస్తామని మిశ్రా వెల్లడించారు. పదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ప్రత్యేక ఆరతి పాస్ అవసరం లేదు. భక్తులు ఎంచుకున్న ఆరతి తేదీన ఆలయంలోకి ప్రవేశించడానికి బుకింగ్ ప్రక్రియలో వెల్లడించిన ఐడీ కార్డు కాపీని తప్పనిసరిగా వెంట వుంచుకోవాలి. అంతేకాకుండా ఆలయ నిర్వాహకులు .. ఆరతి నిర్ధారణ కోసం 24 గంటల ముందే భక్తులకు రిమైండర్‌ను పంపుతారు. చివరిగా భక్తులు తమ పాస్‌లను రిపోర్టింగ్ లొకేషన్‌లో వున్న ఆరతి పాస్ కౌంటర్ నుంచి పాస్‌లు పొందవచ్చని అధికారులు తెలిపారు.