అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత దేశానికి ఈ నెల 24, 25వ తేదీలలో వస్తున్న విషయం తెలిసిందే. ట్రంప్ నేరుగా అక్కడి నుండి మొతేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ అనే కార్యక్రమంలో పాల్గొంటారు. 

ఆ కార్యక్రమంలో ఇద్దరు నేతలు కలిసి ఉపన్యసిస్తారు. ట్రంప్ దాదాపుగా మూడు గంటలపాటు అక్కడ గడపనున్నారు. ఆయన ఆ తరువాత అక్కడి నుండి ఆగ్రా బయల్దేరివెళ్తారు. అక్కడ తాజ్ మహల్ ను సందర్శించి తదుపరి రోజున ఢిల్లీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి మొతేరా క్రికెట్ స్టేడియం మధ్యలోని మార్గమంతా జనాలు నిలబడి ట్రంప్, మోడీలకు స్వాగతం పలుకుతారని భారతీయ వర్గాలు తెలిపాయి. ఈ 22 కిలోమీటర్ల దారిలో దాదాపుగా 70 లక్షల మంది నిలబడి స్వాగతం పలుకనున్నారని ట్రంప్ ఒక సభలో వ్యాఖ్యానించారు. 

దీనిపై భారత వర్గాలు స్పందిస్తూ... ఒక లక్ష మంది వరకు హాజరవుతారని భారత్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మొత్తం అహ్మదాబాద్ నగర జనాభా కూడా 70 నుంచి 80 లక్షల లోపే ఉంటుంది. ఇలాంటి తరుణంలో 70 లక్షల మంది రోడ్డుకు ఇరువైపులా ఎలా నిలబడతారని అనుకున్నట్టు ట్రంప్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో జోకులు పేలుస్తున్నారు. 

ఇక ఈ విషయం పై తాజాగా రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ట్విట్టర్లో ఒక వ్యంగ్య పోస్టును పెట్టాడు. ట్రంప్ అన్నట్టు నిజంగా 70 లక్షల మంది అక్కడకు రావాలంటే... అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రజినీకాంత్, దీపికా పదుకొనె, కత్రినా కైఫ్, సన్నీ లియోన్ ను ట్రంప్ పక్కన నిలబెట్టాలని అన్నాడు. 

అలా గనుక నిలబెట్టినప్పుడు మాత్రమే 70 లక్షల మంది వస్తారని సెటైర్లు వేసాడు వర్మ. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వర్మ వేసిన సెటైర్ తెగ ట్రెండ్ అవుతుంది. బ్రిలియంట్ ఐడియా అంటూ కొందరు అంటుంటే... మరికొందరేమో ఇంకా బాటిల్ పక్కకు పెట్టండంటూ రాము మీదే సెటైర్లు వేస్తున్నారు.