కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో దేశం ముందుకు సాగడం నిలిచిపోకూడదని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్రమోడీ. మణిపూర్‌ ప్రజల కష్టాలను తీర్చేందుకు ఉద్దేశించిన నీటి సరఫరా ప్రాజెక్ట్‌కు ప్రధాని గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్కడి మహిళలకు తానిస్తున్న రక్షాబంధన్ కానుకగా దీనిని అభివర్ణించారు. అభివృద్ధి పనులకు కరోనా వైరస్ అడ్డంకి కాకూడదని ఆయన పేర్కొన్నారు.

ఇంఫాల్ మహానగరం, మణిపూర్‌లోని  1700 గ్రామాలకు ఈ ప్రాజెక్ట్ రక్షిత మంచినీటిని సరఫరా చేస్తుందని ప్రధాని తెలిపారు. అక్కడి ప్రజలకు ఇది జీవన రేఖగా మారుతుందని.. రాష్ట్రంలోని మహిళలు, లక్షల కుటుంబాలకు ఉపయోగపడుతుందని మోడీ ఆకాంక్షించారు.

స్థానిక పంచాయతీలు, ప్రజల సహకారంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించిందని.. వికేంద్రీకరణకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ అని ప్రధాని అభివర్ణించారు. ఈ నీటి ప్రాజెక్ట్ ద్వారా వేల మందికి ఉపాధి దొరుకుతుందని మోడీ అన్నారు.

ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలు కరోనా మహమ్మారి, వరదతో కష్టాలు పడుతున్నారని ప్రధాని ఆవేదన వ్యక్తం చెందారు. వరదల కారణంగా చాలామంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని.. ఈ కష్టకాలంలో వారందరికీ అండగా నిలుస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.