వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన గణతంత్ర పరేడ్‌ ఢిల్లీలో రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. పోలీసులు అడుగడుగునా అడ్డుకొనేందుకు ప్రయత్నించినా రైతులు ఎర్రకోట ఎక్కి తమ నిరసన తెలిపారు.

ఈ నేపథ్యంలో నిరసనలు రైతు నేతల చేయి దాటిపోయాయంటూ వస్తున్న ఆరోపణలపై బీకేయూ నేత రాకేశ్‌ తికాయత్‌ స్పందించారు. తమ ట్రాక్టర్ల ర్యాలీలోకి ఇతరులు చొరపడ్డారని ఆయన ఆరోపించారు.

పరేడ్‌ను చెడగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు చొరబడ్డారని, తమ ర్యాలీలోకి చొరబడినవారిని గుర్తించినట్టు చెప్పారు.   

Also Read:రైతుల ఆందోళన: కెనడాలో ఎన్ఆర్ఐల కారు ర్యాలీ

మరోవైపు, ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని దాటుకొని ముందుకు వెళ్లి చివరకు ఎర్రకోట వద్దకు చేరుకున్నారు.

ప్రగతి మైదాన్‌, ఐటీవో.. ఈ రెండు మార్గాల ద్వారా ఎర్రకోట వద్దకు చేరుకొనేందుకు విశ్వప్రయత్నం చేసిన నిరసనకారులు.. చివరకు ఎర్రకోటపై కిసాన్‌ జెండాను ఎగురవేశారు.

ఇండియా గేట్‌ వద్దకు ఎలాగైనా చేరుకొని రాజ్‌పథ్‌లో ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు అడ్డంగా పెట్టిన బస్సులు, ఇతర వాహనాలను ధ్వంసం చేయడంతో రణరంగంలా మారింది.