Rajya Sabha Elections 2022: మహారాష్ట్రలో జ‌రుగ‌నున్న‌రాజ్యసభ ఎన్నికల్లో అధికార మహా వికాస్ అఘాడీ(MVA) కి  మద్దతు ఇవ్వ‌నున్న‌ట్టు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఇంత‌వ‌ర‌కూ MVA నాయకుడు ఎవరూ సంప్ర‌దించ‌లేద‌ని, మా మద్దతు కావాలంటే.. మమ్మల్ని సంప్రదించాలని ఒవైసీ అన్నారు. 

Rajya Sabha Elections 2022: రాజ్యస‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి చెక్ పెట్టేందుకు మహారాష్ట్ర‌లో అసదుద్దీన్ ఒవైసీ మహా వికాస్ అఘాదీ (MVA) తో పొత్తుకు సిద్ధమయ్యారు. జూన్ 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మ‌హారాష్ట్ర నుంచి బీజేపీని ఓడించేందుకు మహా వికాస్ అఘాదీకి (MVA) మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ముందుకొచ్చారు. ఈ త‌రుణంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. బీజేపీని ఓడించేందుకు ఎంవీఏకు మద్దతిస్తానని ప్రకటించారు. 

 ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం: ఒవైసీ

నాందేడ్‌లో సోమవారం AIMIM ఎమ్మెల్యేల‌తో ఒవైసీ సమావేశాన్ని నిర్వహించారు. అయితే రాజ్యసభ ఎన్నికల్లో అధికార కూటమికి మద్దతు ఇవ్వాలా? లేదా అనే అంశాన్ని చ‌ర్చించారు. ఈ సంద‌ర్బంగా ఓవైసీ మాట్లాడుతూ, “MVA నుండి ఏ నాయకుడు మా ఎమ్మెల్యేలను సంప్రదించలేదు. వారికి మా మద్దతు కావాలంటే, వారు మమ్మల్ని సంప్రదించాలని ఒవైసీ అన్నారు.

రాజ్యసభ ఎన్నిక Rajya Sabha Elections ల్లో బీజేపీని ఓడించాలని అధికార ప‌క్షం మహా వికాస్ అఘాడీ నిజంగా భావిస్తే.. మమ్మల్ని బహిరంగంగా మద్దతివ్వమని అడగాల‌ని ఒవైసీ అన్నారు. లేదా మద్దతివ్వాలో..? లేదో? అనే అంశంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఒవైసీ అన్నారు.

బీజేపీని ఓడించాలనుకుంటే మద్దతు అడగండి: ఇంతియాజ్ జలీల్

ఔరంగాబాద్‌కు చెందిన AIMIM ఎంపీ ఇంతియాజ్ జలీల్ మాట్లాడుతూ.. పార్టీకి సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనీ, అధికార కూటమి బీజేపీని ఓడించాలనుకుంటే.. బహిరంగంగా AIMIM మద్దతు కోరాలని అన్నారు. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర శాసనసభలో AIMIMకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. 

ప్రస్తుత స్థితి ఏమిటి?

15 రాష్ట్రాల్లోని మొత్తం 57 రాజ్యసభ స్థానాలకు మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో, బీజేపీకి చెందిన పీయూష్ గోయల్, వినయ్ సహస్త్రబుద్ధే, వికాస్ మహాత్మే పదవీ విరమణ చేయనున్నందున మహారాష్ట్రలోని 6 స్థానాల్లో ఖాళీ ఏర్పడ్డ‌నున్న‌ది. ఈ ఆరు స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు పోటీ చేయనున్నారు. 

శివసేన తన ఇద్దరు అభ్యర్థులుగా సంజయ్ రౌత్, సంజయ్ పవార్‌లను నిలబెట్టగా, బీజేపీ ముగ్గురు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహదిక్‌లను బరిలోకి దింపింది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) ప్రఫుల్‌ పటేల్‌ను, కాంగ్రెస్‌ తరఫున ఇమ్రాన్‌ ప్రతాప్‌గఢీ పోటీ చేశారు. 

288 మంది సభ్యుల అసెంబ్లీలో MVA భాగస్వాములైన‌ శివసేనకు 55, NCP - 53, కాంగ్రెస్‌కు 44 మంది శాసనసభ్యులు ఉన్నారు. బీజేపీకి గరిష్టంగా 106 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఏఐఎంఐఎం, సమాజ్‌వాదీ పార్టీకి ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్ జైలులో ఉన్నారు. అసెంబ్లీలో ప్రస్తుత బలం ఆధారంగా.. బీజేపీకి రెండు సీట్లు రావడానికి సరిపడా ఓట్లు ఉండగా, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఒక్కో సీటు గెలుచుకునే గెలుచుకునే అవకాశం ఉంది.

MVA MLAలను ముంబై కి త‌ర‌లింపు

ఇదిలా ఉంటే.. రాజ్యసభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు.. MVA సంకీర్ణంలో అధికార భాగస్వామి, శివసేన తన ఎమ్మెల్యేలందరినీ ముంబైలోని ఓ హోట‌ల్ కు తరలించడం ప్రారంభించింది. త‌మ ఎమ్మెల్యేల‌ను బీజేపీ ఎక్క‌డ లాక్కుంటుందోన‌నే భయంతో ఈ చ‌ర్య‌కు పాల్ప‌డుతోంది. ఈ ఎన్నికలు ముగిసే వరకు వారిని ఆ హోటల్‌లోనే బస చేసేందుకు పార్టీ ఏర్పాట్లు చేసింది. మంగళవారం నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఇత‌ర పార్టీల‌ శాసనసభ్యులు, స్వతంత్రులను ఆ హోటల్‌కి తీసుకెళ్ల‌నున్న‌ట్టు, ఆ శాసనసభ్యులంద‌రూ వచ్చే మూడు రోజులు హోటల్‌లోనే గడపనున్న‌ట్టు స‌మాచారం.