గత కొంతకాలంగా వరుస ఎదురుదెబ్బలతో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు.. ఈ రాజ్యసభ ఎన్నికలు స్వల్ప ఊరటనిచ్చే అవకాశం ఉంది. తాజా రాజ్యసభ ఎన్నికల ద్వారా కాంగ్రెస్‌కు ఎగువ సభలో కొద్దిపాటి బలం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేశంలోని 15 రాష్ట్రాల్లో ఖాళీ అవ్వనున్న 57 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నట్టుగా తెలిపింది. గత కొంతకాలంగా వరుస ఎదురుదెబ్బలతో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు.. ఈ రాజ్యసభ ఎన్నికలు స్వల్ప ఊరటనిచ్చే అవకాశం కనిపిస్తుంది. గత ఎనిమిదేళ్లుగా పార్లమెంటులో కాంగ్రెస్ బలం తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజా రాజ్యసభ ఎన్నికల ద్వారా కాంగ్రెస్‌కు ఎగువ సభలో కొద్దిపాటి బలం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 8 సీట్లను సొంతం చేసుకోనుంది. మొత్తంగా కాంగ్రెస్‌కు 11 రాజ్యసభ సీట్లు వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ 29 సభ్యుల బలం ఉంది. వీరిలో.. అంబికా సోని (పంజాబ్), చిదంబరం (మహారాష్ట్ర), జైరాం రమేష్ (కర్ణాటక), వివేక్ తంఖా (మధ్యప్రదేశ్), ప్రదీప్ టామ్టా (ఉత్తరాఖండ్), కపిల్ సిబల్ (ఉత్తర ప్రదేశ్), ఛాయా వర్మ (ఛత్తీస్‌గఢ్) పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. ఇటీవల 57 స్థానాలకు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఈ స్థానాలు కూడా ఉన్నాయి. దీంతో రాజ్యసభలో కాంగ్రెస్ బలం 20కి పడిపోనుంది.
అయితే ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఉన్న బలాలను పరిశీలిస్తే.. రాజస్థాన్ నుంచి మూడు, ఛత్తీస్‌గఢ్ నుంచి 2, మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా నుంచి ఒక్కో సీటుతో.. మొత్తం ఎనిమిది రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశం ఉంది. మరోవైపు తమిళనాడు నుంచి ఒక బెర్త్ కాంగ్రెస్‌కు ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా.. మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో మిత్ర పక్షాల సహకారంతో ఒక్కో సీటు దక్కుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో మొత్తంగా 11 స్థానాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఇలా జరిగిన పక్షంలో పెద్దల సభలో కాంగ్రెస్ బలం 33కు చేరుతుంది.
అయితే ఈ స్థానాలకు పార్టీ సీనియర్లు, ప్రస్తుతం పదవీకాలం ముగిసిన నేతల పోటీ గట్టిగానే ఉంది. పి చిదంబరం, జైరాం రమేష్‌లతో సహా కొంతమంది అగ్రనేతలు మరో దఫా రాజ్యసభ సీటుపై దృష్టి సారించారు. మరోవైపు రాజ్యసభ బెర్త్ కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్న మరికొందరు నేతలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
చిదంబరం మరో దఫా తనను రాజ్యసభకు పంపేందుకు పార్టీ అధిష్టానం ఆమోదం తెలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు నుంచి కాంగ్రెస్‌కు దక్కుతుందని భావిస్తున్న రాజ్యసభ సీటుపై ఆయన కన్నేశారు. ఇప్పటికే ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను కలిశారు. అయితే ఈ సీటును పార్టీ డేటా అనలిటిక్స్ విభాగం అధిపతి ప్రవీణ్ చక్రవర్తికి కేటాయించాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం.
మరోసారి రాజ్యసభ బెర్త్‌పై ఆశ పెట్టుకున్న జైరాం రమేష్.. తనను మరోమారు కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ హైకమాండ్‌ను కోరుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా కర్ణాటక లేదా హర్యానా నుంచి రాజ్యసభకు వెళ్లాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా కొనసాగిన జైరాం రమేష్.. మరోసారి అవకాశం దక్కుతుందా లేదా అనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది.
హర్యానాలో ఒకే ఒక్క సీటు కోసం సుర్జేవాలా, కుమారి సెల్జా, కుల్దీప్ బిష్ణోయ్ పోటీ పడుతున్నారు. అయితే హర్యానా నుంచి ఆనంద్ శర్మ నామినేషన్ కోసం మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా పట్టుబడుతున్నట్టుగా సమాచారం. ఇక, మిత్రపక్షమైన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కపిల్ సిబల్‌కు రాజ్యసభ బెర్త్ ఆఫర్ చేసిందని.. అయితే ఇందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో సిబల్ కాంగ్రెస్‌ను వీడి.. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) మద్దతుతో ఇండిపెండెంట్‌గా ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు.
రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు కచ్చితంగా రెండు సీట్లు వస్తాయని.. మరికొందరు ఎమ్మెల్యేల మద్దతుతో మరో సీటు కూడా దక్కించుకోవచ్చని అంటున్నారు. మాకెన్, ఆజాద్‌లు ఈ సీట్లకు గట్టి పోటీదారులుగా ఉన్నట్లు సమాచారం. G-23 నాయకుల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్ కూడా రాజ్యసభ బెర్త్‌పై ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఐదు సార్లు పెద్దల సభలో పనిచేశారు. జీ-23లో కీలకంగా ఉన్న ఆయన.. ఇటీవల కాలంలో పార్టీ హైకమాండ్‌తో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో పార్టీ అధికారాన్ని పంచుకున్న మహారాష్ట్రలో.. కాంగ్రెస్‌కు ఒక రాజ్యసభ సీటు లభించే అవకాశాలు ఉండగా.. వాస్నిక్, అవినాష్ పాండే రేసులో ఉన్నారు.
