Rajya Sabha Election 2022: రాజ్యసభ అభ్యర్థుల జాబితా తయారీలో బీజేపీ అనేక అపసోపాలు పడింది. చివరికీ 18 మంది అభ్యర్థులతో కూడా జాబితాను ప్రకటించింది. కానీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్‌తోపాటు పలువురు ప్రముఖ నేతలకు మొండి చేయి చూపించింది.
Rajya Sabha Election 2022:రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన విషయంలో అధికార బీజేపీ కాస్త గందరగోళానికి లోనైంది.18 మంది అభ్యర్థుల జాబితా తయారీలో అనేక మల్లగుల్లాలు పడింది. పలువురు నేతలకు మొండి చేయి చూపించింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్‌తోపాటు పలువురు ప్రముఖ నేతలకు నిరాశ మిగిల్చింది.
15 రాష్ట్రాలకు చెందిన 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10న పోలింగ్ జరుగనున్నది. ఇందు కోసం బీజేపీ.. కర్ణాటక నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్‌లకు అధిష్టానం అవకాశమిచ్చింది. అలాగే.. జగ్గేష్‌కు కర్ణాటక నుంచి, ఉత్తరాఖండ్ నుంచి కల్పనా సైనా, మధ్యప్రదేశ్ నుంచి సుశ్రి కవితా పటిదార్, మహారాష్ట్ర నుంచి రైతు నాయకుడు, మహారాష్ట్ర మంత్రి అనిల్ సుఖ్‌దేవ్‌రావ్ బొండే, రాజస్థాన్ నుంచి ఘన్‌శ్యామ్ తివారీ బరిలో దించింది. బీహార్ నుండి ఓబీసీ (ఇతర వెనుకబడిన తరగతి) నాయకుడుశంభు షారన్ పటేల్ రాజ్యసభ కు పంపనున్నది.
ఇక ఉత్తరప్రదేశ్ నుంచి ఫిబ్రవరి-మార్చి రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోసం గోరఖ్‌పూర్ సీటును వదులుకున్న రాధా మోహన్ అగర్వాల్ రాజ్యసభకు ఎంపికయ్యారు. అలాగే లక్ష్మీకాంత్ వాజ్‌పేయీ, సురేంద్రసింగ్, బాబురామ్ నిషద్, దర్శన సింగ్, సంగీతా యాదవ్‌లను బరిలో దించింది. బీహార్ నుంచి సతీష్ చంద్ర దూబేకు.. హర్యానా నుంచి కిషన్ లాల్ పన్వార్‌కు అవకాశం కల్పించింది.
అదే సమయంలో పలు ప్రముఖ నేతలకు బీజేపీ అధిష్టానం పక్కన పెట్టింది. తొలి జాబితాలో అవకాశం దక్కని జార్ఖండ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బార్ నఖ్వీకి రెండో జాబితాలోనూ మరోసారి నిరాశ ఎదురైంది. రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో నఖ్వీ పేరు లేకుండానే జాబితా ప్రకటించింది. అలాగే.. కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ కు కూడా బీజేపీ అధిష్టానం మొండి చేతి చూపించింది.
అలాగే..రాజ్యసభలో బీజేపీ చీఫ్ విప్, కేంద్ర మాజీ మంత్రి శివ ప్రతాప్ శుక్లా, బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, ఓపీ మాథుర్, వినయ్ సహస్త్రబుద్ధే పేర్లను జాబితా నుంచి తొలగించారు. అలాగే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లామ్, యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన సంజయ్ సేథ్ పేర్లను కూడా జాబితా ను తొలిగించడం గమనార్హం.
