ప్రతిపక్షాల నిరసనను ఖండిస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు మంగళవారం సభలో ప్రకటన చదువుతూ కంటనీరు పెట్టుకున్నారు. ప్రతిపక్షాల తీరు తనను బాధించిందని, నిన్న నిద్ర లేని రాత్రి గడిపారని అన్నారు. ప్రజాస్వామ్యానికి పార్లమెంటు ఆలయం వంటిదని, ప్రతిపక్షాలు గర్భగుడిలోకి వచ్చి బల్లలు ఎక్కి హంగామా చేశారని చెప్పారు.

న్యూఢిల్లీ: రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడు కన్నీరుమున్నీరయ్యారు. నిన్నటి పరిణామాలను ఖండిస్తూ ప్రకటన చదువుతూ ఉద్విగ్నతకు లోనయ్యారు. నిన్న తాను నిద్ర లేని రాత్రి గడిపారని, కొందరు ప్రతిపక్ష ఎంపీలు అంతటి హైడ్రామా సృష్టించడానికి కారణాలేమిటో తనకు తెలియరాలేదని కన్నీరుపెట్టుకున్నారు. పార్లమెంటు ప్రజాస్వామ్యానికి ఆలయం వంటిదని, అలాంటి ఆలయంలో కొందరు ప్రతిపక్ష ఎంపీలు సభ పవిత్రతను భంగం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నారని, సభా మర్యాదను మంటగలిపారని గద్గద స్వరంతో అన్నారు.

కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తూ రాజ్యసభలో మంగళవారం ప్రతిపక్ష నేతలు గందరగోళం సృష్టించారు. సభాపతి ముందు కూర్చునే సిబ్బందికి సమీపంలోని బల్లలు ఎక్కి ఆందోళన చేశారు. నల్లటి వస్త్రాలను ఊపుతూ, ఫైల్స్ విసిరేశారు. కొందరు ఆ టేబుల్స్ ఎక్కి కూర్చోగా, ఇంకొందరు వాటిపైనే నిలబడి నిరసనలు చేశారు. సభాపతి వారించినప్పటికీ వినలేదు. ఈ పరిణామాలపై రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు బుధవారం సభలో బాధపడ్డారు. ప్రతిపక్ష ఎంపీ చర్యలను ఖండిస్తూ ఓ స్టేట్‌మెంట్ చదివారు.

ప్రజాస్వామ్యానికి పార్లమెంటు ఆలయం వంటిదని, సభా మధ్య భాగం గర్భగుడి వంటిదని వెంకయ్యనాయుడు పోల్చారు. కొందరు సభ్యుల సభా పవిత్రతను భంగం చేస్తూ టేబుల్స్ ఎక్కి కూర్చున్నారని, ఇంకొందరు అందరికీ కనిపించేలా ఎక్కి నిలబడ్డారని, ఈ నిర్వాకం తనను ఎంతో బాధించిందని వివరించారు. వారి ప్రవర్తతపై ఆగ్రహించడానికి, ఖండించడానికి తన దగ్గర పదాలే లేవని, ఈ పరిణామాలు తలుచుకుంటూ నిన్న రాత్రి నిద్రకూడా పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీరు పెట్టుకుని కొంత సమయం తీసుకుని మళ్లీ ప్రకటన చదవడాన్ని కొనసాగించారు.

సభలో ఎవరైనా తమ నిరసనను తెలిపే హక్కు ఉంటుందని, కానీ, ప్రభుత్వాన్ని ఇలాగే చేయాలని చెప్పే అధికారం ఉండదని వెంకయ్యనాయుడు తెలిపారు. చివరికి నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికే ఉంటుందని స్పష్టం చేశారు. ఇంతలోనే కొందరు సభ్యులు సభాపతి వెంకయ్యనాయుడు ప్రకటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ, ప్రతిపక్షాలకు అతీతంగా తటస్థంగా సభాపతి వ్యవహరించాలని, కానీ, వెంకయ్యనాయుడు ప్రభుత్వానికి మద్దతుగా ప్రకటన చేస్తున్నట్టు ఉన్నదని అభ్యంతరం తెలిపారు.