ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారతీయ మైనారిటీలపై వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నేతలు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా భాజపా నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఒబామాపై విరుచుకుపడ్డారు.
Obama Remarks Row: ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్బంగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారతీయ ముస్లింలు, మైనార్టీల భద్రత గురించి ప్రశ్నించాలని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ను కోరిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారతీయ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలను విమర్శించారు. ఒబామా తన పరిపాలనలో ఎన్ని ముస్లిం దేశాలపై దాడి చేశారో చూడాలని సూచించారు. ప్రపంచంలో నివసించే ప్రజలందరినీ కుటుంబంగా భావించే ఏకైక దేశం భారత్ అని, ఈ విషయాన్ని ఒబామా మరచిపోకూడదని, అతను ఎన్ని ముస్లిం దేశాలపై దాడి చేశాడో కూడా ఆలోచించాని రక్షణ మంత్రి అన్నారు.
ప్రధాని మోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో US మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక మీడియా ఇంటర్వ్యూలో.. మైనారిటీలను రక్షించకపోతే, దేశం ఏదో ఒక సమయంలో విడిపోవడానికి బలమైన అవకాశంగా మారుతుందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ PM మోడీని కలిస్తే.. మెజారిటీ హిందూ భారతదేశంలో ముస్లిం మైనారిటీల రక్షణ గురించి ప్రశ్నించాలని అన్నారు.
ఒమామా వ్యాఖ్యలపై తొలుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విరుచుకుపడ్డారు. ఆయన హయాంలో అమెరికా ఆరు ముస్లిం ఆధిపత్య దేశాలపై బాంబు దాడి చేసిందని అన్నారు. ఢిల్లీలో ఆదివారం నాడు నిర్మలా సీతారామన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ గురించి దేశావిదేశాల నేతలు కీర్తిస్తుంటే.. అమెరికా మాజీ అధ్యక్షుడు (బరాక్ ఒబామా) భారతీయ ముస్లింలపై ప్రకటన చేయడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అమెరికాతో తాము స్నేహాన్ని కోరుకుంటే.. వారు మాత్రం భారతదేశ మత సహనం గురించి వ్యాఖ్యానించారు. ఒబామా కారణంగా 6 ముస్లిం ఆధిపత్య దేశాలు బాంబు దాడికి గురయ్యాయి, అతని హయంలో 26,000 కంటే ఎక్కువ బాంబులు వేయబడ్డాయని విమర్శలు గుప్పించారు.
మరోవైపు.. మాజీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా ఒబామాపై విరుచుకుపడ్డారు. భారతదేశాన్ని కించపరిచేవారిని ఎవరూ నమ్మరని అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ప్రకటన చేయడం దురదృష్టకరమన్నారు. 1984 లాంటి అల్లర్లు దేశంలో నేడు జరగడం లేదని, భారత వ్యతిరేకుల ఆధారంగా భారత్‌పై దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తే ఎవరూ నమ్మరని నఖ్వీ అన్నారు. నేడు దేశంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి. విదేశాల నుంచి కొంతమంది భారత్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం దురదృష్టకరమన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు చేసిన వారిపై ప్రతిపక్ష నాయకులు ఎవరూ ఖండించలేదని, వారి గురించి ఎలాంటి ప్రకటన ఇవ్వలేదని అన్నారు.
