Asianet News TeluguAsianet News Telugu

రాజ్ నాథ్ సింగ్ కు అదిరిపోయే బ‌హుమ‌తినిచ్చిన మంగోలియా అధ్య‌క్షుడు

భార‌త‌దేశ‌ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కి మంగోలియా అధ్య‌క్షుడు కురేల్‌సుక్ అంద‌మైన‌ గుర్రాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని రాజ్ నాథ్ సింగ్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. 
 

Rajnath Singh Gifted Horse By Mongolian President
Author
First Published Sep 7, 2022, 11:17 AM IST

మంగోలియాలో పర్యట‌న‌లో ఉన్న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఆ దేశ అధ్య‌క్షుడ‌ బుధవారం అందమైన గుర్రాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ విష‌యాన్ని రాజ్‌నాథ్‌సింగ్ త‌న ట్విట్ట‌ర్ వేదికగా తెలిపారు. "మంగోలియాలోని మా ప్రత్యేక స్నేహితుల నుండి ఒక ప్రత్యేక బహుమతి. నేను ఈ అద్భుతమైన గుర్రానికి   'తేజస్' అని పేరు పెట్టాను. ప్రెసిడెంట్ ఖురేల్‌సుఖ్ ధన్యవాదాలు. ధన్యవాదాలు మంగోలియా" అని తెల్లటి గుర్రం చిత్రాలతో పాటు ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం మంగోలియా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఇలాంటి బహుమతి లభించడం విశేషం. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ మంగోలియాను సందర్శించినప్పుడు.. ఆ దేశ‌ ప్రధాని సి. సాయిఖాన్‌బిలెగ్  గోధుమ రంగు గుర్రాన్ని బహుకరించారు. 

ఇదిలా ఉంటే.. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ ప్ర‌స్తుతం మంగోలియాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆయ‌న మంగ‌ళ‌వారం నాడు మంగోలియా అధ్య‌క్షుడితో వ్యూహాత్మ‌క సంబంధాల‌పై చ‌ర్చించారు. ఇరుదేశాల మ‌ధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. 

ఈ సంద‌ర్భంగా ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ ట్విట్ చేస్తూ...  “ఉలాన్‌బాటర్‌లో..  మంగోలియా అధ్యక్షుడు యు. ఖురల్‌సుఖ్‌తో ఇది మంచి సమావేశం. నేను ఆయనను చివరిసారిగా 2018లో దేశ ప్రధానిగా ఉన్నప్పుడు కలిశాను. మంగోలియాతో మా బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. అని పేర్కొన్నారు. 

ఈ ప‌ర్య‌ట‌న భాగంగా..  ఉలాన్‌బాతర్‌లోని నేషనల్ డిఫెన్స్ యూనివర్శిటీలో భారత-సహాయక 'సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ సెంటర్'ను కూడా రాజ్‌నాథ్ ప్రారంభించారు. భారతదేశం సహాయంతో నిర్మించనున్న ఇండియా-మంగోలియా ఫ్రెండ్‌షిప్ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు. 
 
రాజ్‌నాథ్ సింగ్ సోమవారం నుంచి ఐదు రోజుల పాటు మంగోలియా, జపాన్‌లలో పర్యటించనున్నారు. ప్రాంతీయ భద్రతా పరిస్థితి, ప్రపంచ భౌగోళిక రాజకీయాలలో గందరగోళం మధ్య రెండు దేశాలతో భారతదేశం వ్యూహాత్మక,  రక్షణ సంబంధాలను విస్తరించడం ఈ పర్యటన లక్ష్యం.  ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు రాజ్ నాథ్ సింగ్ మంగోలియాలో ప‌ర్య‌టించ‌నున్నారు.  ఈ తూర్పు ఆసియా దేశాల‌ను ఓ భారత రక్షణ మంత్రి ప‌ర్య‌టించడం ఇదే తొలిసారి.

మంగోలియా ప‌ర్య‌ట‌న అనంత‌రం రక్షణ శాఖ‌ మంత్రి రెండు రోజుల పర్యటనలో భాగంగా జపాన్‌లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఆయన జపాన్‌లో ప‌లు చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. సెప్టెంబర్ 8న 'టూ ప్లస్ టూ' పద్ధతిలో జపాన్‌తో చర్చలకు హాజరుకానున్నారు. భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భారత్‌కు వెళ్లిన దాదాపు ఐదు నెలల తర్వాత ఈ చర్చలు జరుగుతున్నాయి.
  

Follow Us:
Download App:
  • android
  • ios