గుజరాత్‌లో రాజ్‌కోట్‌కు చెందిన న్యాయవాది సోహిల్ హుస్సేన్ మోర్‌ను (Sohil Hussain Mor) పోలీసులు అరెస్ట్ చేశారు. మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టడం తన ఇరుగుపొరుగువారిపై కత్తితో బెదిరింపులకు పాల్పడటంతో పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
గుజరాత్‌లో రాజ్‌కోట్‌కు చెందిన న్యాయవాది సోహిల్ హుస్సేన్ మోర్‌ను (Sohil Hussain Mor) పోలీసులు అరెస్ట్ చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, దాడి చేయడం, ఒక పోలీసు తన విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం వంటి ఆరోపణలపై సోహిల్ హుస్సేస్‌పై పోలీసులు రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ముంజ్కా సమీపంలోని శామప్రసాద్ ముఖర్జీ నగర్ ఆవాస్‌లో ఆదివారం సాయంత్రం మోర్ వీరంగం సృష్టించాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే.. సోహిల్ హుస్సేన్ తన సొసైటీ వాట్సాప్ గ్రూప్‌లో శివాజీ మహారాజ్ గురించి కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేశాడు. ఈ వ్యాఖ్యపై సొసైటీ సభ్యులలో ఒకరైన జ్యోతి సోధా అభ్యంతరం వ్యక్తం చేశారు. మోర్‌కు మొబైల్ ఫోన్‌కు కాల్ చేశారు. అయితే ‘ఇప్పుడు ఈ దేశం పాకిస్తాన్‌గా మారింది.. మీరందరూ దేశం విడిచి వెళ్ళాలి’ అని సోహిల్ హుస్సేన్ తనతో చెప్పాడని జ్యోతి సోధా తెలిపారు.
ఆ తర్వాత జ్యోతి సోధా.. సోహిల్ హుస్సేన్‌ను వ్యక్తిగతం కలవడానికి వెళ్లారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కోరారు. అయితే సోహిల్ హుస్సేన్ అవేమీ పట్టించుకోకుండా.. ఆమెను కత్తితో పొడుస్తానని బెదిరించాడు. ఆ తర్వాత సోహిల్ తన చర్యలతో ఆ ప్రాంతంలో అలజడి సృష్టించాడు. అక్కడ ఉన్న గణేష్ విగ్రహాన్ని పాడు చేశాడు. వెంటనే సొసైటీకి చెందినవారు ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో ఒక పోలీసు బృందం సొసైటీకి చేరుకుంది.. కానిస్టేబుల్ రావత్ దంగర్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాడు. కానీ సోహిల్ హుస్సేన్ కానిస్టేబుల్‌ను కొట్టాడని, దుర్భాషలాడాడినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి పోలీసులు సోహిల్ హుస్సేన్‌పై IPC సెక్షన్లు 295, 295 (a), 504, 135, 332, 186 కింద మోర్‌పై FIR నమోదు చేశారు. ఆ తర్వాత సోమవారం సోహిల్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక, ఓ న్యూస్ చానల్ షేర్ చేసిన ఆడియో రికార్డింగ్‌లో.. ఇలాంటి పోస్ట్‌లు వస్తాయని సోహిల్ హుస్సేన్ ఒక మహిళకు చాలా కోపంగా చెప్పడం వినిపించింది. ‘ఇది ఇప్పుడు పాకిస్తాన్‌గా మారింది.. ఇక్కడ అందరూ ముస్లింలు ఉండాలి .. హిందువులందరూ వెళ్లిపోవాలి’ అని సోహిల్ హుస్సేన్ చెప్పిన ఆడియో రికార్డింగ్‌ను ఆ న్యూస్ చానల్ షేర్ చేసింది.
